calender_icon.png 9 February, 2026 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల అంకితభావానికి గౌరవం

09-02-2026 01:05:22 AM

  1. 1,446 మంది సిబ్బందికి రివార్డులు
  2. తొలిసారిగా వినూత్న పురస్కారాలు
  3. విధి నిర్వహణకు మించి పనిచేస్తేనే ప్రజల్లో గుర్తింపు
  4. పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్

హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): హైదరాబాద్ నగర పోలీ సు వ్యవస్థలో విధి నిర్వహణకు సరికొత్త నిర్వచనం చెబుతూ.. అంకితభావంతో పనిచేసే సిబ్బందికి సముచిత గౌరవం లభించిం ది. తమ విధులకు మాత్రమే పరిమితం కాకుండా, బాధ్యతకు మించి సేవలందించిన 1,446 మంది పోలీసు సిబ్బందికి నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదివారం రివార్డులు అందజేశారు.

బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఎక్స్‌ట్రా మైల్, గుడ్ వర్క్ డన్ పురస్కారాలను కమిషనరేట్‌లో తొలిసారిగా ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలను ఉద్దేశించి సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. పోలీసు వృత్తి కేవలం డ్యూటీ మాత్రమే కాదని, అదొక సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. అప్పగించిన పనిని పూర్తి చేయడం సాధారణం..

కానీ బాధితులకు ఎంతటి భరో సా కల్పించామన్నదే అసలైన విజయం. సాంకేతికత ఎంత పురోగమించినా, క్షేత్రస్థాయిలో సిబ్బంది ప్రదర్శించే మానవత్వానికి ఏ టెక్నాలజీ సాటిరాదు అని ఆయన కొనియాడారు. సిబ్బందిలోని సృజనాత్మకతను, వినూత్న ఆలోచనలను ప్రోత్సహించేందుకే ఎక్స్‌ట్రా మైల్ పురస్కారాలను ప్రవేశపెట్టామని, ఇది సిబ్బందిలో నూతనోత్తేజాన్ని నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గత ఆర్థిక ఏడాదిలోని మూడు త్రైమాసికాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేశారు. విధులకు అతీతంగా సమాజానికి మేలు చేసిన 271 మందికి ఎక్స్‌ట్రా మైల్ పురస్కారం దక్కింది. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 1,175 మందికి గుడ్ వర్క్ డన్ రివా ర్డులు వరించాయి. పురస్కారాలు అందుకున్న వారిలో హోంగార్డుల నుంచి అదనపు డీసీపీల వరకు అన్నిస్థాయిల సిబ్బందితో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు,

మినిస్టీరియల్ సిబ్బంది కూడా ఉండటం విశేషం. సిబ్బందిలో నిరంతరం స్ఫూర్తిని నింపేందుకు ఈ పురస్కారాల ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగిస్తామని సీపీ వెల్లడించారు. ఇకపై ప్రతి నెలా జోనల్‌స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎస్‌హెచ్‌ఓలు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లను గుర్తించి గౌరవిస్తామని తెలిపారు. కష్టపడి పనిచేసే ప్రతి అధికారికి, సిబ్బందికి గుర్తింపు కచ్చితంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీ ఎం.శ్రీనివాసులు, జాయింట్ సీపీ ఎన్ శ్వేత, డీసీపీలు శిల్పవల్లి, చైతన్యకుమార్, అరవింద్‌బాబు, లావణ్య నాయక్, వెంకటలక్ష్మి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.