12 May, 2026 | 7:40 PM

మహిళల అక్రమ రవాణాపై స్పందించండి

22-06-2024 12:05 AM
  1. లైంగిక వ్యాపారంపైనా వివరాలు ఇవ్వండి
  2. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం 

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): మహిళల అక్రమ రవాణా, లైంగిక వ్యాపారంపై దాఖలైన రిట్ పిటిషన్లపై హైకోర్టు విచారించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 10కి వాయిదా వేసింది. చట్టప్రకారం బాధితులను వారి ఇళ్లకు పంపడానికి సరైన మార్గదర్శకాలు లేవంటూ అనైతిక ట్రాఫికింగ్ నిరోధక చట్టం-1956 ప్రకారం అలాంటి బాధితుల పునరావాసం కోసం పనిచేస్తున్న సంస్థ ప్రజ్వల ప్రధాన కార్యదర్శి సునీతకృష్ణన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా శుక్రవారం విచారించారు.

సీనియర్ న్యాయవాది రవిచందర్ వాదనలు వినిపిస్తూ మహిళల అక్రమ రవాణా, లైంగిక వ్యాపారం నుంచి రక్షించేందుకు సంస్థలు, రక్షిత గృహాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ఒకవేళ కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చినా సరైన సహకారం కూడా అందించడం లేదని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్ సంస్థకు పోలీస్ రక్షణ కల్పించాలని ఆదేశించారు. అవసరమైన సమయంలో సత్వర చర్యలు తీసుకోవాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.