1 August, 2026 | 1:33 AM

ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయినా బాధ్యత ముగియలేదు

01-08-2026 01:14 AM

పార్లమెంట్ ఎస్‌ఐఆర్ కోఆర్డినేటర్ ఆరెపల్లి మోహన్

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 31 (విజయక్రాంతి): ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ దాదాపు వంద శాతం పూర్తయిందని ఆదిలాబాద్ పార్లమెంట్ ఎస్‌ఐఆర్ కో-ఆర్డినేటర్ ఆరెపల్లి మోహన్ తెలిపారు.

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశానికి రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్ అహ్మద్, ఎమ్మెల్సీ దండే విట్టల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్,నియోజకవర్గ ఇన్చార్జి శ్యాం నాయక్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ కలసి హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు, నాయకుల బాధ్యత ముగియలేదన్నారు.

చిరునామా మారిన వారు, గుర్తించలేని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 100 శాతం ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి కావడం సంతోషకరమని పేర్కొన్నారు. విజయానికి కృషి చేసిన బీఎల్‌ఏలు, పోలింగ్ బూత్ అబ్జర్వర్లు, నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు, నాయకులు, కార్యకర్తలను అభినందించిన ఆయన, ఇకపై ’షిఫ్టెడ్’ ఓట్ల వివరాల పరిశీలనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ గతంలోనూ ఎస్‌ఐఆర్ ప్రక్రియలు జరిగినప్పటికీ ఈసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరి కారణంగానే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించిందని విమర్శించారు.  డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ అర్హులైన ఒక్క పౌరుడైనా ఓటు హక్కు కోల్పోకూడదన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని చెప్పారు. బూత్ స్థాయిలో బీఎల్‌ఏలు, నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తూ అర్హులైన ఓటర్ల వివరాల నమోదుకు కృషి చేశారని తెలిపారు.

ఓటరు జాబితాకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా వెంటనే కాంగ్రెస్ నాయకులను లేదా బీఎల్‌ఏలను సంప్రదించాలని సూచించారు.ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు మంగ, విశ్వనాథ్, డిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి గాదవేణి మల్లేష్, ఉపాధ్యక్షుడు భీమ్రావు, మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా,మండల అధ్యక్షుడు రాపర్తి మురళి, పట్టణ అధ్యక్షుడు ఇమ్రాన్,నాయకులు పాల్గొన్నారు.