రెస్ట్ ఆఫ్ ఇండియాదే ఇరానీ కప్
- జమ్మూ కశ్మీర్‌పై విజయం
- అదరగొట్టిన పేసర్ ముకేశ్
శ్రీనగర్, అక్టోబర్ 4 : దేశవాళీ క్రికెట్ ప్రతిష్టాత్మక టోర్నీల్లో ఒకటైన ఇరానీ కప్‌ను రెస్ట్ ఆఫ్ ఇండియా(Rest of India wins Irani Cup) కైవసం చేసుకుంది. శ్రీనగర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు రంజీ ఛాంపియన్ జమ్మూ కశ్మీర్‌పై విజయం సాధించింది. ఆరంభంలో ఆధిక్యం సాధించినప్పటకీ జమ్మూ చివరి వరకూ దానిని నిలబెట్టుకోలేకపోయింది. అదే సమయంలో రిషబ్ పంత్ సారథ్యంలోని రెస్ట్ ఆఫ్ ఇండియా అద్భుతంగా పుంజుకుని మ్యాచ్ గెలిచింది.
టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న జమ్ము కశ్మీర్ బౌలర్లు రెస్ట్ ఆఫ్ ఇండియాను కేవలం 237 పరుగులకే కట్టడి చేశారు. ఆ తర్వాత జమ్ము కశ్మీర్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 278 పరుగులు చేసి, 41 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో మ్యాచ్‌పై పట్టు సాధించినట్లు కనిపించింది. జమ్ము కశ్మీర్ తరఫున పారస్ డోగ్రా (75), అబ్దుల్ సమద్ (57) రాణించారు. రెండో ఇన్నింగ్స్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా బ్యాటర్ స్మరణ్ రవిచంద్రన్ అద్భుత శతకంతో కదంతొక్కడంతో ఆ జట్టు 319 పరుగుల భారీ స్కోరు సాధించింది.
తద్వారా జమ్ము కశ్మీర్ ముందు 279 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. 279 పరుగుల లక్ష్య ఛేదనలో జమ్ము కశ్మీర్ కూడా ధీటుగానే ఆడింది. ఒక దశలో 89/3 స్కోరుతో విజయం దిశగానే సాగుతున్నట్టు కనిపించింది. అయితే రెస్ట్ ఆఫ్ ఇండియా పేసర్ ముకేశ్ కుమార్ తన స్పెల్‌తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి జమ్ము కశ్మీర్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. అతనికి తోడుగా ఆకాశ్ దీప్ 3 వికెట్లు తీశాడు.