పాత పెన్షన్ పునరుద్ధరణే ఏకైక పరిష్కారం: ఎస్టీఎఫ్‌ఐ
25-08-2024 01:50 AM
హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): సీపీఎస్ స్థానంలో ఏకీకృత పెన్షన్ పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్ విధానం మసిపూసి మారేడుకాయ చేయడమేనని, దానిని ఎట్టి పరిస్ధితుల్లో అంగీకరించబోమని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. 25 ఏండ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు 50 శాతం పెన్షన్ గ్యారెంటీ చేస్తున్నట్టు, సర్వీసులో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు 60 శాతం ఫ్యామిలీ పెన్షన్ చేస్తామని ప్రకటించిననప్పటికీ చందాతో కూడిన పెన్షన్ పథకం రద్దు చేసే విషయం ప్రస్తావించకుండా ఐచ్చికం అని పేర్కొనడంతో అసలు మోసం ఉందని శనివారం ఆ సంఘం నాయకులు చావ రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఒక రూపాయి చెల్లించకుండానే సర్వీసు ఆధారంగా 50 శాతం పెన్షన్ ఇచ్చే పాత విధానం పునరుద్ధరించాల్సిందేనని డిమాండ్ చేశారు.






