15-11-2025 01:37:25 AM
న్యూఢిల్లీ, నవంబర్ 14: బీహార్ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపుతో పాటు శుక్రవారం దేశవ్యాప్తంగా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. పంజాబ్‌లోని తరన్ తారన్ అసెంబ్లీ స్థానంలో ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థి హర్మీత్ సింగ్ సంధు విజయం సాధించారు. శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి సుఖ్‌విందర్ కౌర్‌పై 42,649 ఓట్ల మెజార్టీ సాధించారు. ఎమ్మెల్యే డాక్టర్ కాశ్మీర్ సింగ్ సోహల్ మరణంతో ఈ సీటు ఖాళీ అయ్యింది.
రాజస్థాన్‌లోని అంతా ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు అభ్యర్థి ప్రమోద్ జైన్ గెలుపొందారు. భాజపా అభ్యర్థి సుమన్‌పై విజయం సాధించారు. ఎమ్మెల్యే కన్వర్‌లాల్‌పై అనరత వేటు పడడంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఒడిశాలోని నువాపడా ఉప ఎన్నికలో అధికార భాజపా అభ్యర్థి జయ్ ఢొలాకియా విజయం సాధించారు. ఎమ్మెల్యే రాజేంద్ర ఢొలాకియా మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
జార్ఖండ్‌లోని ఘట్‌శిలా స్థానంలో ఝార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థి సోమేశ్‌చంద్ర సోరెన్ విజయం సాధించారు. ఎమ్మెల్యే రామ్‌దాస్ సోరెన్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. జమ్మూ కశ్మీర్‌లోని రెండు చోట్ల ఉప ఎన్నిక జరగ్గా.. నాగ్రోటా అసెంబ్లీ స్థానంలో భాజపా అభ్యర్థి దేవయానీ రాణా విజయం సాధించారు. స్థానిక ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రాణా మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది.
బడ్గాంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అభ్యర్థి ఆగా సయ్యద్ ముంతజీర్ మెహదీ గెలుపొందారు. గత ఎన్నికల్లో రెండోచోట్ల పోటీ చేసిన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.. బడ్గాం స్థానాన్ని ఖాళీ చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. మిజోరంలోని డంపా స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఎంఎన్‌ఎఫ్ అభ్యర్థి లాల్‌థాంగ్లియానా విజయం సాధించారు. ఎమ్మెల్యే లాల్రింట్లుంగా సైలా మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.