గవర్నమెంట్ స్కూల్ అంటే గర్వంగా చెప్పే ఫలితాలు
చండ్రుపట్ల హైస్కూల్ ఘన విజయం
కల్లూరు, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉత్తమ విద్యను అందిస్తూ ప్రతిభావంతుల్ని తీర్చిదిద్దుతున్నాయనే విషయాన్ని చండ్రుపట్ల హైస్కూల్ విద్యార్థులు మరోసారి రుజువు చేశారు.ప్రభుత్వ బడులను చులకనగా చూసే వారికి ఇది గట్టి సమాధానమని స్థానిక విద్యార్థులు,ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.
బుధవారం విడుదలైన ఎస్సెస్సీ ఫలితాల్లో చండ్రుపట్ల జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల 96.87 శాతం ఉత్తీర్ణత సాధించి విశేష ఫలితాలు నమోదు చేసింది.మొత్తం 32 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా,వారిలో 31 మంది ఉత్తీర్ణులయ్యారు.చండ్రుపట్ల హైస్కూల్ ఉత్తీర్ణతలో మొదటి 10 స్థానాలు సాధించిన వారు రఘునాధ బంజర విద్యార్థులే కావడం విశేషంగా నిలిచింది.
ఈ ఫలితాల్లో రామిశెట్టి సాయి వెన్నెల 571 మార్కులు సాధించి పాఠశాల టాపర్గా నిలిచారు. ఎస్కే నసీమ 551 మార్కులతో ద్వితీయ స్థానం పొందారు.పేద కుటుంబానికి చెందిన సాయి వెన్నెల తండ్రి మరణించినప్పటికీ,తల్లి ప్రోత్సాహం,పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంతో అగ్రస్థానాన్ని సాధించడం విశేషం. ఈ సందర్భంగా మండల విద్యాధికారి నివేదిత, ప్రధానోపాధ్యాయులు బి. శ్రీనివాస్ విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల కృషి,ఉపాధ్యాయుల నిబద్ధత ఫలితంగా ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యకు కేంద్రాలుగా నిలుస్తున్నాయని,విద్యార్థులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని వారు సూచించారు. ఈ విజయాన్ని ఆదర్శంగా తీసుకుని మరింత మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల వైపు ఆకర్షితులవ్వాలని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.






