తిరుగుముఖం పట్టిన ఓటర్లు
ఆంధ్రా, తెలంగాణ జిల్లాల నుంచి నగరానికి రద్దీ
టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్
యాదాద్రిభువనగిరి, మే 13 ( విజయక్రాంతి): ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సోమ వారం ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఓటేయడానికి తమతమ సొంతూళ్లకు వెళ్లిన నగరవాసులు తిరుగుపయనం అయ్యారు. దీంతో సోమవారం సాయంత్రం నుంచే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. వాహ నాలు బారులు తీరడంతో రహదారి మొత్తం కిక్కిరిసింది. టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధి కోసం వచ్చినవారు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో నివాసముంటున్నారు.
వీరి ఓట్లు మాత్రం వారివారి స్వగ్రామాల్లో ఉండటంతో శుక్ర, శని, ఆదివారాల్లో వారివారి సొంతూళ్లకు వెళ్లారు. అలా వెళ్లిన వాళ్లంతా సోమవారం నుంచి తమతమ విధులు నిర్వహించడానికి ఒకేసారి నగరానికి తిరుగుపయనం కావడంతో రహదారులపై విపరీతంగా రద్దీనెలకొంది. వీరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ జిల్లాలోని ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, కోదాడ తదితర ప్రాంతాలకు చెందిన వాళ్లు కూడా ఉన్నారు. ఒకేసారి విజయవాడ జాతీయ రహదారిపై తాకిడి పెరగడంతో యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి క్లియర్ చేస్తున్నారు.




