9 April, 2026 | 12:25 PM

మాధవీలత, రాజాసింగ్‌పై కేసు నమోదు

14-05-2024 12:35 AM

ముస్లిం మహిళ నకాబ్ తీసిన మాధవీలత

హైదరాబాద్ అభ్యర్థి తీరుపై ఎన్నికల అధికారి ఆగ్రహం

ప్రజాప్రాతినిధ్యం చట్టం ఉల్లంఘన కింద కేసు నమోదు

పోలింగ్ సిబ్బందిని తిట్టిన ఎమ్మెల్యే రాజాసింగ్

హైదరాబాద్, సిటీబ్యూరో/నిజామాబాద్, మే 13 (విజయక్రాంతి)/ చాంద్రా యణగుట్ట: హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి మాధవీలతతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సోమవారం కేసు నమోదైంది. మలక్‌పేట పోలీసు స్టేషన్ పరిధలోని ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లిన మాధవీలత ఓటువేసేందుకు వేచి ఉన్న ముస్లిం మహిళ ఐడీని చెక్‌చేసేందుకు నకాబ్ తీయాలని కోరారు. ఆమె నిరాకరించటంతో మాధవీలతే స్వయంగా తొలగించారు. దీంతో ఆగ్రహించిన మహిళ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఆరా తీసిన హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ బీజేపీ అభ్యర్థిపై కేసు నమోదు చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. దీంతో ఆమెపై ఐపీసీ సెక్షన్లు 171సీ, 186,  505 (10)(సీ), ప్రజాప్రాతినిధ్య చట్టం 132 కింద కేసు నమోదు చేశారు.

రాజాసింగ్ వివాదం

బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓటు వేసేందుకు మంగళ్‌హాట్ పరిధిలోని ఎస్‌ఎస్‌కే జూనియర్ కళాశాలకు వెళ్లారు. అక్కడ విధుల్లో ఉన్న పోలింగ్ అధికారులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఎన్నిక స్కాడ్ ఫిర్యాదు మేరకు మంగళ్‌హాట్‌లో పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేశారు.  

ఎలా అనుమతిస్తారు?: అర్వింద్ 

ముస్లిం మహిళలు హిజాబ్ తొలగించి ముఖం చూపించకున్నా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రంలోని అనుమతించటంపై నిజామాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజామాబాద్ నగరంలోని రోడ్డు, మాలాపల్లి ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌లలో సోమవారం పర్యటించిన ఆయన.. ముస్లిం మహిళలు హిజాబ్ తొలగించిన తర్వాతే ఓటువేసేందుకు అనుమతించాలని పోలింగ్ అధికారులతో వాగ్వాదానికి దిగారు.