రేవంత్, హరీశ్ చీకటి ఒప్పందం
l సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారు
l అందుకే రాజీనామాల డ్రామా
l సీఎం హామీలు నెరవేరిస్తే నేనూ వైదొలుగుతా..
l లేదంటే రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా?
l బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): కాళేశ్వరం అవినీతి అంశాన్ని పక్కదారి పట్టించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఇంతకుముందు ఫోన్ ట్యాపింగ్ కేసును తెచ్చారని, ఇప్పుడు ఆగస్టు 15 లోపు రుణమాఫీ హామీ అమలు అంశా న్ని ముందుకు తీసుకువస్తూ అసలు అంశాన్ని చర్చకు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఈ హామీల అమలుకు సంబంధించి రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావు రాజీనామాల డ్రామా ఆడుతున్నారని, ఇద్దరి మధ్య చీకటి ఒప్పందంలో భాగంగానే ఇదం తా నడుస్తోందని ఆయన విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నుంచి వస్తున్నారని మీరు చెబుతున్న 26 మంది ఎమ్మెలేలకు హరీశ్‌రావే నాయకత్వం వహిస్తున్నారా? అనే అనుమానం వస్తోందని, బీఆర్‌ఎస్ నుంచి వచ్చే షిండే హరీశ్‌రావేనా అని ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యన ఉన్న సంబంధం కూడా ప్రజలకు అర్థమవుతున్నదన్నారు.
మిగతా హామీలపై చాలెంజులు లేవా..?
ఒక్క రుణమాఫీ విషయంలో మాత్రమే చాలెంజ్ తీసుకుంటే మిగతా హామీలు గాలికి వదిలేస్తారా? అని రేవంత్‌రెడ్డిని ఏలేటి ప్రశ్నించారు. వాటికి సవాళ్లు విసురుకోరా అని అడి గారు. 50 శాతం బీసీ కుటుంబాలకు రూ.10 లక్షలు ఇస్తామని ఇప్పుడు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, రైతు, యూత్ డిక్లరేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. 6 గ్యారెంటీలు, 420 హామీలు నెరవేరుస్తా, లేదంటే రాజీనామా చేస్తాననే చాలెంజ్‌కు సిద్ధమేనా అంటూ రేవంత్‌కు సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ సీట్లు గెలిపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని గతంలో సవాల్ విసిరానని, ఇప్పుడూ అదే మాటపై ఉన్నానని స్పష్టం చేశారు. అందుకు రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఇద్దరి రాజీనామా లేఖలు స్పీకర్ ఫార్మాట్‌లో రాసి ఓ చోట డిపాజిట్ చేద్దామని, కాంగ్రెస్ మాట మీద నిలబడితే నా లేఖను స్పీకర్‌కు పంపించవచ్చని పేర్కొన్నారు. బడ్జెట్‌లో కేటాయిం చిన నిధులు రూ.63 వేల కోట్లు మాత్రమేనని, ఇచ్చిన హామీలన్ని పూర్తి చేయాలంటే రూ. 5.50 లక్షల కోట్లు కావాలన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చీకటి ఒప్పందం ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నదని అన్నారు.
వారిది మైనారిటీ అజెండా...
బీజేపీ వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారన్న రేవంత్ ఆరోపణలపై స్పందిస్తూ.. రాజ్యాంగాన్ని ఎక్కువ సార్లు సవరించిన పార్టీ కాంగ్రెస్ అని మహేశ్వర్‌రెడ్డి గుర్తుచేశారు. తాము కేవలం ఈబీసీల కోసం మాత్రమే రాజ్యాంగ సవరణ చేశామన్నారు. మైనార్టీల కోసం రిజర్వేషన్లు కల్పించి బీసీలకు అన్యాయం చేశారని అన్నా రు. బీసీల కోటాల్లో మైనారిటీలు స్థానిక సంస్థ ల్లో అవకాశాలు పొందిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ది ఎప్పుడూ మైనార్టీలను మోసే అజెండా అని విమర్శించారు. ఆ పార్టీ కేవలం మైనారిటీల గురించి ఆలోచిస్తే.. బీజేపీ బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం ఆలోచిస్తుందన్నారు. దేశంలో ఇప్పుడు జరుగుతున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ 50 సీట్లు కూడా గెలిచే అవకాశం లేదని ఎద్దేవా చేశారు.






