19-03-2025 05:03:57 PM
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నగేష్ ముదిరాజ్..
ముషీరాబాద్ (విజయక్రాంతి): రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నగేష్ ముదిరాజ్ ఆరోపించారు. ఇది తెలంగాణ ప్రజలను మోసం చేసే బడ్జెట్ అని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఏడాదికి 70 వేల కోట్ల రూపాయల రెవెన్యూ తగ్గిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్తుంటే, ఆర్థిక శాఖ మంత్రి ఏమో రెవిన్యూలో రాష్ట్రం దూసుకుపోతుందని తప్పుడు లెక్కలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రూ. 3 లక్షల 5 వేల కోట్ల బడ్జెట్లో అధిక శాతం జనాభా ఉన్న బీసీలకు కేవలం రూ. 11 వేల కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు.
బడ్జెట్ కేటాయింపు అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి పడిపడి సన్మానం చేసిన బీసీ నాయకులంతా ఒక్కసారి ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలపై వివక్ష చూపుతోందన్నారు. రాష్ట్రంలో అధిక జనాభా ఉన్న బీసీలకు కేవలం రూ. 11 వేల కోట్లు, ఎస్సీలకు రూ.40 వేల కోట్లు, ఎస్టీలకు రూ. 17వేల కోట్ల బడ్జెట్ కేటాయించిందని, ఎస్సీలతో సమానంగా నిధులు కేటాయించకుండా బీసీలకు తీరని అన్యాయం చేశారన్నారు. ఇది పక్కా బీసీ వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు. మైనారిటీలకు రూ. 3 వేల కోట్లు కేటాయించడం అత్యంత దారుణం అన్నారు.
రాష్ట్రం అభివృద్ధిలో పయనిస్తుందని గొప్పలు చెప్పుకునే ఈ ప్రభుత్వం ఐటి కి కేవలం రూ.700 కోట్లు టూరిజంకు రూ. 700 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. ఈ విధంగా చేస్తే మన రాష్ట్రంలో పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. విద్యారంగానికి రూ. 12 వేల కోట్లు కేటాయించి అన్యాయం చేశారన్నారు. చేనేత రంగాన్ని అణగదొక్కాలి అనే ఉద్దేశంతోనే కేవలం రూ. 300 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందని ఆయన మండిపడ్డారు.