శంకర్‌గౌడ్ మృతికి రేవంత్‌రెడ్డిదే బాధ్యత
- ఆయన అమరుడైన రోజును అప్పాయింటెడ్ డేగా ప్రకటించాలి
- మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): శంకర్ గౌడ్ మృతికి సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత అని, ఈ ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ఆర్టీసీ విలీనప్రక్రియను పూర్తిచేస్తామని, ఇతర అన్ని సమస్య లు పరిష్కరిస్తామని చెప్పి మాట తప్పడంవల్లనే ఈ దుస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు సైతం అమలుచేయకుండా రేవంత్‌రెడ్డి ఇంకెన్నాళ్లు కాలం గడుపుతారు..
ఎంతమందిని బలి తీసుకుంటారని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్‌గౌడ్ మృతిపై శుక్రవారం హరీశ్‌రావు స్పందించారు. శంకర్‌గౌడ్ ఆత్మబలిదానం మా హృదయాలను తీవ్రంగా కలిచివేసిం దని తెలిపారు. సంస్థను కాపాడేందుకు, కార్మికుల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన శంకర్ గౌడ్‌కు ఘన నివాళుల ర్పించారు. హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలి తప్ప, ఇలాంటి ఆత్మబలిదానాలకు ఎవరూ ఒడిగట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, శంకర్‌గౌడ్ అమరుడైన రోజును అప్పాయింటెడ్ డేగా ప్రకటించాలన్నారు.






