14 March, 2026 | 2:51 AM

బుల్డోజర్లతో రేవంత్ యుద్ధం

14-03-2026 01:31 AM

మూసీ ప్రాజెక్టు కోసం 3,279 ఎకరాల్లోని 1 0 వేల నిర్మాణాలు కూల్చివేతలు

గాంధీ విగ్రహాన్ని పెట్టేందుకు ఇన్ని ఇళ్లు కూల్చడం అవసరమా?

  1. ఇది ఎకలాజికల్ ప్యూరిఫికేషనా? ఆస్తటిక్ బ్యూటిఫికేషనా? 
  2. మొదట ప్రాజెక్టు డీపీఆర్‌ను ప్రజల ముందు పెట్టండి
  3. రేవంత్‌రెడ్డి బుల్డోజర్ రాజ్ రాహుల్‌గాంధీకి కనిపించడం లేదా
  4. ఖజానా ఖాళీ అంటూనే రూ.లక్షా50 వేల కోట్లకు టెండర్ 
  5. పేదల ఇండ్లు కూల్చడాన్ని బీజేపీ సమర్థిస్తుందా? 
  6. మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): ఒకవైపు గల్ఫ్ దేశాల్లో బాంబులు వేస్తూ ఇండ్లు కూల్చుతుంటే, ఇక్కడ ఏ యు ద్దం లేదు, బాంబులు లేకుండానే మూసీ పునరుజ్జీవం పేరిట సీఎం రేవంత్‌రెడ్డి బుల్డోజర్లతో విధ్వంసం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ ప్రకారం.. 3,279.19 ఎకరాల్లోని 10,017 నిర్మాణాలను కూల్చుతామంటున్నారని, దాదాపు లక్ష మంది జీవితాలు కూల్చబోతున్నారని పేర్కొన్నారు. గాంధీ విగ్రహం పెట్టడానికి ఇన్ని ఇండ్లు కూల్చడం అవసరమా? అని ప్రశ్నించారు.

రెండున్నరేండ్లలో పది ఇండ్లు కూడా కట్టని రేవంత్‌రెడ్డికి పది వేల ఇండ్లను కూల్చే హక్కు ఎవరు ఇచ్చారని నిలదీశారు. అసలు రేవంత్‌రెడ్డికి కూల్చడంపై ఎందుకు ఇంత శ్రద్ధ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో హరీష్‌రావు మాట్లాడారు. ఒకసారి మూసీ సుందరీకరణ, మరోసారి మూసీ ప్రక్షాళన, ఇంకోసారి మూసీ పునరుజ్జీవం.. ఇలా పూటకో పేరు మార్చుతూ, రోజుకో చోట ప్రజల ఇండ్లు కూల్చే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.

మూసీ అభివృద్ధి పేరు చెప్పి హైదరాబాద్‌లో ఈ విధ్వంసఖాండను ఎందుకు కొనసాగిస్తున్నారని, మీరు చేస్తున్నది ఎకలాజికల్ ప్యూరిఫికేషనా? లేదా ఆస్తటిక్ బ్యూటి ఫికేషనా? అని నిలదీశారు. మూసీ ప్రాజెక్టు డీపీఆర్‌ను మొదట ప్రజల ముందు పెట్టాలని, ఎలాంటి డీపీఆర్ లేకుండా, ప్రణాళిక లేకుండా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న నివాసాలను కూల్చుతూ, భయబ్రాంతులకు గురిచేయడం ఏంటని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి బుల్డోజర్ రాజ్ రాహుల్‌గాంధీకి కనిపించడం లేదా? ఉత్తరప్రదేశ్ లో జరిగే బుల్డోజర్ రాజ్‌కు, తెలంగాణలో జరిగే బు ల్డోజర్ రాజ్‌కు తేడా ఏముంది? దీనికి రా హుల్‌గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా, బాధితుల పక్షాన ప్రశ్నిస్తున్నామని, సమాధానం చెప్పాలని రేవంత్‌రెడ్డిని నిలదీశారు. 

లూటిఫికేషన్‌కు బీఆర్‌ఎస్ వ్యతిరేకం

మూసీ పునరుజ్జీవనానికి బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని, కానీ మూసీ పేరిట రేవంత్‌రెడ్డి చేస్తున్న లూటిఫికేషన్‌కు, సుందరీకరణ పేరిట వేల మందిని నిరాశ్రయులుగా చేస్తున్న దానికి వ్యతిరేకమని హరీశ్‌రావు స్పష్టంచేశారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి తీరు చూస్తే తుగ్లక్ పాలన గుర్తు కు వస్తున్నదని, కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించి, అభివృద్ధి పథంలో నడిపిస్తే.. రేవంత్ తన తుగ్లక్ పాలనతో అధోగతిపాలు చేస్తున్నారని మండిపడ్డారు.

మూసీ ప్రక్షాళన మీద చిత్తశుద్ధి ఉన్న వారెవరూ ముందే పేదల ఇళ్లు కూల్చబోరని స్పష్టంచేశారు. వికారాబాద్ నుంచి ఇక్కడి వరకు మురుగు నీటిని ఆపకుండా ప్రక్షాళన ఎలాచేస్తారన్నారు. ఒకవైపు ఖజానా ఖాళీఅంటూనే.. రేవంత్‌రెడ్డి ఏకంగా లక్షా 50 వేల కోట్లకు టెండర్ పెట్టారని ఎద్దేవాచేశారు. లక్షా 50 వేల కోట్లతో మూసీ బ్యూటిఫికేషన్ అంటూ లూటీకి ఎగబడుతున్నారని ఆరోపించారు.

రేవంత్‌రెడ్డి గోబెల్స్ రెడ్డి.. అన్నీ మాట తప్పు డే. ఒక్కటీ చేయరని.. రేవంత్‌రెడ్డికి నిజాలు మాట్లాడొద్దు అనే శాపం ఉన్నట్టు ఉందని ఎద్దేవాచేశారు. రేవంత్‌రెడ్డి ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో కూర్చొని ప్రణాళిక రచిస్తున్నారంటే ఎలాంటి ప్రణాళిక లేకుండానే ఇన్ని రోజులు పేదల ఇండ్లు కూల్చారా అని నిలదీశారు. నిజంగా మూసీ ని బాగుచేయలనే చిత్తశుద్ధి ఉంటే పరీవాహక ప్రాంతాల్లో తిరిగి, ప్రజలతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ఫైవ్ స్టార్ హోటళ్లలో, నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లోని ఏసీ గదుల్లో కూర్చొని కాగితాలు తిరగేస్తే ఏం ప్రయోజనం అని ప్రశ్నించారు.

మూసీ ప్రక్షాళన శంకుస్థాపనకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ఆహ్వానిస్తామంటున్నారని, మూసీ రిట రేవంత్‌రెడ్డి చేస్తున్న రియల్ ఎస్టేట్ దందాకు, దోపిడీకి బీజేపీ సహకరిస్తున్నదా? పేదల ఇండ్లు కూల్చడాన్ని సమర్థిస్తుందా? సమాధానం చెప్పాల ని డిమాండ్‌చేశారు. కిషన్‌రెడ్డి బస్తీ నిద్ర అని ప్రచారంలో చిత్తశుద్ధి లేదని ప్రశ్నించారు. 

సీఎం రేవంత్‌రెడ్డికి 8 ప్రశ్నలు.. 

అసెంబ్లీ వేదికగా జనవరిలో సీఎం ఇచ్చిన సమాధానం ప్రకారం, హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు అధ్యయనం చేసి డీపీఆర్ ఇవ్వడానికి 18 నెలలు పడుతుంది అన్నరు. మరి డీపీఆరే రాకుండా పేదలకు ఎలా నోటీసులు ఇచ్చారు? ఎందుకు పేదల ఇండ్లు కూలగొడుతున్నారు?. 10,017 ఇండ్లు కూల్చుతామని గెజిట్ ఎట్లా ఇచ్చారు.

అసలు మీరు చేస్తున్నది మూసీ నది ప్రక్షాళననా? మూసీ సుందరీకరణనా?

అసలు బఫర్ ఎంత? ఒక ప్రభుత్వం 9 మీటర్లు, మరొక ప్రభుత్వం 30 మీటర్లు? ఇప్పుడు రేవంత్‌రెడ్డి 100 మీటర్లు అంటున్నారు. అసలు బఫర్ ఎలా నిర్ణయించారు. ఉంటే స్టడీ బయట పెట్టండి? అసలు మూసీ నుంచి ఎలా కొలుస్తారు?.

ఏదైనా ప్రాజెక్టు చేయాలంటే కనీసం వంద ఏళ్ల డేటా తీసుకొని చేస్తాం. హైడ్రాలజికల్ లేదా ఫ్లడ్ వాటర్ స్టడీ చేసారా? చేస్తే బయట పెట్టండి.

జనవరిలో జరిగిన శాసనసభ సమావేశాల్లో సీఎం ఏడీబీ లోన్ 4,100 కోట్లు మూసీకి ఇవ్వడానికి ఒప్పుకున్నది. మంజూరు అయ్యింది అని చెప్పారు. కానీ ఏడీబీ డిసెంబర్ 15, 2025లో ఏమన్నది ఇంకా డీపీఆర్ మాకు సమర్పించలేదు, మా పద్ధతి పాటిస్తేనే రుణం ఇస్తామని చెప్పింది. 

లోన్ మంజూరు అయ్యిందా లేదా? అసెంబ్లీని తప్పుదోవ పట్టించారా?. 

ఇప్పటికే చాదర్‌ఘాట్‌లో మూసీలో 300 ఇళ్లు కూల్చారు. యూపీఏనే తెచ్చిన భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు. ఏడాది కింద కూలగొట్టిన 300 మందికే ఏం చేయలేదు. మధు రిడ్జ్ అపార్ట్‌మెంట్ వాసులు ఎట్ల నమ్ముతారు?.

మధు రిడ్జ్ అపార్ట్‌మెంట్ వాసులకు 7 ఎకరాలకు 7 ఎకరాలు ఇస్తా అన్నారు. మూసీ వెంట మొత్తం 46 కాలనీలు ఉన్నాయి. పది వేల ఇండ్లు కూలగొడుతా అంటున్నారు. వీళ్లకు కూడా అదే పద్ధతిలో స్థలం కేటాయిస్తారా? బ్యాంకుల్లో నిధులు జమ చేస్తారా? పది వేల మందికి ఇదే తీరుగా ఇళ్లు కట్టిస్తారా? వారి ఉపాధికి ఎవరు బాధ్యులు?

మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజల ఆవాసాలే కాదు, మెట్రో రైల్వేస్టేషన్, బస్టాండ్లు, ఎస్టీపీలు, దేవాలయాలు, చర్చీలు, ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ కూల్చుతారా? మీ స్టాండ్ ఏమిటో స్పష్టంచేయండి.