దక్షిణాదిపై ప్రతీకారం!
- పార్లమెంట్‌లో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గించాలని కేంద్రం కుట్రలు
- డీలిమిటేషన్ వల్ల ఉత్తరాది రాష్ట్రాలకే ప్రయోజనం
- కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి
- పెట్టుబడులను ప్రధాని మోదీ గుజరాత్‌కే పంపుతున్నారు: సీఎం రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ, మార్చి 7: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ వివాదంపై అఖిలపక్ష సమావేశం నిర్వహిం చాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇండి యా టుడే కాంక్లేవ్-2025లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘బీజేపీకి దక్షిణాదిలో బలం లేదు.
అందుకోసమే డీలిమిటేషన్ ద్వారా ఇక్కడి పార్లమెంట్ స్థానాలను తగ్గించాలని ప్రతీకారం గా కుట్రలు చేస్తోంది. దక్షిణాదిపై కక్ష తీర్చుకోవాలని కేంద్రం భావిస్తోంది. డీలిమిటేషన్ ఉత్తరాది రాష్ట్రాలకే ప్రయోజనం చేకూర్చనుంది. బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చినా, దక్షిణాదిలో మాత్రం విఫలమైంది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెల్చుకున్న 240 సీట్లలో దక్షిణాదిలో కేవలం 29 స్థానాలు మాత్రమే ఉన్నా యి. అంతకుమించి దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఎక్కడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. కేవలం తన భాగస్వామితో కలిసి ఏపీలో మాత్రమే ప్రభుత్వాన్ని నడుపుతోంది. 1971 జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ జరగాలి.
కుటుం బ నియంత్రణ అనేది కేంద్రం ఆలోచనే. దక్షిణాది రాష్ట్రాలు దానిని సమర్థవంతంగా అమలు చేశాయి. 30 ఏండ్ల వరకు డీలిమిటేషన్ జరపొద్దు. ఈ విధానం వల్ల యూపీ సీట్లు గణనీయంగా పెరుగుతాయి. ప్రస్తుతం అక్కడ 80 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అవి 120కి చేరుతాయి’. అని అన్నారు.
తెలంగాణ మోడల్ టీ20.. గుజరాత్ మోడల్ టెస్టు
‘గుజరాత్ మోడల్ అనేది టెస్టు క్రికెట్ లాంటిది. అది ఎప్పుడో ఆదరణ కోల్పోయింది. కానీ తెలంగాణ మోడల్ టీ20 లాంటిది. గుజరాత్‌లో సంక్షేమానికి ఎటువంటి స్థానం లేదు. ఏదో ఇతర అభివృద్ధిని చూపిస్తూ మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో పెట్టుబడులు తెచ్చుకున్నారు. మోదీ ప్రధాని అయ్యాక గుజరాత్‌కు ఎవరూ బ్రాండ్ అంబాసిడర్ లేరు. అందుకోసమే ప్రధానే స్వయంగా గుజరాత్‌ను ప్రమోట్ చేస్తున్నారు.
మోదీ ప్రధానిగా ఇతర రాష్ట్రాలకు సాయం చేయడం లేదు. ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి వస్తే.. ఆయన వారిని గుజరాత్‌కు పంపి అక్కడ పెట్టుబడులు పెట్టిస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేలా ఆయన ప్రయత్నాలు చేయడం లేదు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన తెలంగాణ మోడల్‌లో ప్రధానాంశాలు’ అని పేర్కొన్నారు.
ప్రధాని ఎందుకలా చేస్తున్నారు?
‘దేశ ప్రధానిగా దేశంలోని అన్ని రాష్ట్రాలను ప్రోత్సహించాల్సిన ప్రధాని కేవలం ఒక్క గుజరాత్‌ను మాత్రమే ప్రమోట్ చేస్తున్నారు. నేను దేన్నీ జుమ్లా అని పిలవడం లేదు. నాకు ఒక్క విషయంలో స్పష్టత కావాలి. ఫారిన్ కంపెనీ లు అహ్మదాబాద్‌లో పెట్టుబడులు పెట్టేలా ప్ర ధాని చూస్తున్నారు. అంతే ప్రాధాన్యం మిగతా రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వడం లేదు?. ప్రధాని గా కేవలం అహ్మదాబాద్‌కే మోదీజీ ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు?. అదే తరహాలో హైదరాబాద్‌ను ఎందుకు పట్టించుకోవడం లేదు?.’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
అహ్మదాబాద్‌కు ఓఆర్‌ఆర్ ఉందా?
‘అహ్మదాబాద్‌కు ఔటర్ రింగ్ రోడ్ ఉం దా? అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉందా? అక్కడ ఫార్మా రంగంలో పెట్టుబడు లు ఉన్నాయా? ఐటీ పెట్టుబడులు ఉన్నా యా? అసలు గుజరాత్‌లో ఏముంది. అయి నా మేము అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు వంటి నగరాలతో పోటీ పడడం లేదు. ప్రపంచ స్థాయి నగరాలైన న్యూయా ర్క్, సియోల్, టోక్యో వంటి నగరాల్లా హైదరాబాద్‌ను తయారు చేయాలనుకుంటు న్నాం.
రాబోయే ఐదేండ్లలో హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరాల్లో మేటి నగరంగా తీర్చిదిద్దుతా. 20వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ కోసం ప్రణాళికలు రచించాం. ఐదేండ్లలో మీరే చూడండి. ప్రపంచంలోనే మేటి నగరం నిర్మించబోతున్నాం. హైదరాబాద్ ప్రపంచానికి ఎన్నో మందులు అందించింది. కోవిడ్ వ్యాక్సిన్‌ను కూడా హైదరాబాద్ ఉత్పత్తి చేసింది. అసలు గుజరాత్ ఐటీ సెక్టార్‌కు హైదరాబాద్‌కు పోలికే లేదు.
హైదరాబాద్ అభివృద్ధి నాతో మొదలు కాలేదు. కులీకుతుబ్‌షా కాలంలోనే హైదరాబాద్ అభివృద్ధి మొదలయింది. నిజాంలు, బ్రిటీషర్లు, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ హైదరాబాద్ అభివృద్ధికి దోహదపడ్డారు. హైదరాబాద్‌కు 450 ఏండ్ల ఘన చరిత్ర ఉంది’. అని ముఖ్యమంత్రి తెలిపారు.
కేసీఆర్ అప్పుల కుప్ప మిగిల్చారు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ముఖ్యమంత్రి ఒంటికాలుపై లేచారు. ‘2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన సమయంలో తెలంగాణ అప్పులు 69,000 కోట్లుగా ఉండేవి. కానీ ఆయన పదేండ్ల పాలనలో అప్పులు 7 లక్షల కోట్లకు చేరుకున్నా యి. ప్రస్తుతం తెలంగాణ నెలవారీ ఆదా యం రూ. 18,500 కోట్లు మాత్రమే. అందు లో రూ. 6,500 కోట్లు జీతాలు, పించన్లకే పోతుంది. మరో రూ. 6,500 కోట్లు రుణాలు, వడ్డీలు చెల్లించాలి’. అని అన్నారు.
భాషను బలవంతంగా రుద్దుతున్నారు
భాషల వివాదంపై సీఎం స్పందిస్తూ.. ‘ఈ భాషే నేర్చుకోవాలంటూ మీరు ఎవరినీ బలవంత పెట్టలేరు. కాలేజీల్లో ఫ్రెంచ్, జర్మన్, సంస్కృతం వంటి భాషలు చదివే అవకాశం ఉంటుంది. హిందీ మన దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషే అయినా అది జాతీయ భాష కాదు. అధికంగా మాట్లాడే భాషల్లో తెలుగు కూడా ఉంది. మోదీజీ, బీజేపీ హిందీని అందరూ నేర్చుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. మరి వారు తెలుగుకు ఏం చేశారు.’ అని ప్రశ్నించారు.






