ముడా కేసులో సిద్ధరామయ్య భార్యకు ఊరట
ఈడీ సమన్లు రద్దు చేసిన కర్ణాటక హైకోర్టు
బెంగళూరు: మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణం కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి ఊరట లభించింది. కేసు నిమిత్తం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) జారీ చేసిన సమన్లను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. జనవరి 3, 28 తేదీల్లో విచారణకు రావాలంటూ పార్వతికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని కోరుతూ పార్వతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా హైకోర్టు ఈడీ సమన్లను రద్దు చేయడంతో ఆమెకు ఊరట లభించినట్లయింది. ఇదే కేసులో రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి బైరతి సురేశ్‌కు పంపిన నోటీసులను సైతం జస్టిస్ నాగప్రసన్నతో కూడిన సింగిల్ జడ్డి బెంచ్ కొట్టివేసింది. ముడా కేసు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. అయితే ఈ కేసులో లోకాయుక్త నుంచి సీఎం సిద్ధరామయ్యకు క్లీన్ చిట్ లభించింది. సీఎం, ఆయన భార్య సహా నలుగురు నిందితులపై ఖచ్చితమైన ఆధారాలు లభించలేదని లోకాయుక్త పోలీసులు తెలిపారు.






