17 April, 2026 | 7:14 AM

భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు

07-06-2025 02:02 AM

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

అశ్వాపురం, జూన్ 6(విజయ క్రాంతి): రెవెన్యూ, భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి భూభారతి రెవెన్యూ సదస్సులు వేదికలుగా నిలవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామంలో నిర్వహిస్తున్న రె వెన్యూ సదస్సును కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా సదస్సు కు వచ్చిన అర్జీదారుల సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిని ఆన్లైన్ లో నమోదు చేస్తున్నారా అని అధికారులను ఆరా తీశారు. వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. స్వీకరించిన దరఖాస్తులకు రసీదులు అందించాలని, సంబంధిత రిజిస్టర్లలో వివరాలు రాయాలని ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణ, హెల్ప్డె స్క్ లను,రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. సమస్యల వారీగా అర్జీలను విభజిస్తూ, పక్కాగా రికార్డులను పొందుపర్చాలన్నారు.

తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించదగిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. జూన్ 20వ తేదీ వరకు అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నామని,భూ సమస్యలున్న ప్రజలు ఈ సదస్సులకు హాజరై దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. సదస్సులలో ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తును స్వీకరించాలని, సానుకూలంగా ఉన్న సమస్యలను సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు.

ఒకవేళ సమస్యను పరిష్కరించేందుకు నిబంధనలు అంగీకరించని పక్షంలో దరఖాస్తుదారుడికి ఆ విషయాన్ని స్పష్టంగా అర్ధమయ్యే రీతిలో తెలియజేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తుదారులను పదేపదే తిప్పుకోకూడదని, సదస్సులో అర్జీలు అందించేందుకు వచ్చే వారితో సున్నితంగా వ్యవహరించాలని రెవెన్యూ బృందాలకు హితవు పలికారు. అనంతరం కలెక్టర్ మిట్టగూడం గ్రామపంచాయతీ డంపింగ్ యార్డ్ నందు పంచాయతీ సిబ్బంది ,గ్రామస్తులకు బయోచార్ పై అవగాహన కల్పించారు. .ఈ కార్యక్రమంలో అశ్వాపురం తాసిల్దార్, రెవిన్యూ సిబ్బంది, పంచాయతీ అధికారులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.