4 April, 2026 | 1:51 AM

మూడేళ్లలో భారీగా తగ్గిన ఆదాయం

06-05-2024 02:12 AM

గ్రామ పంచాయితీల ఆదాయంపై ఆర్‌బీఐ నివేదిక

మూడేండ్లలో  50% క్షీణత 

సొంత పన్నేతర ఆదాయంలోనూ అదేతీరు

 సొంత ఆదాయం ఆర్జించగల రాష్ట్రాల్లో తెలంగాణ టాప్

హైదరాబాద్, మే 5( విజయక్రాంతి) : గ్రామాలే దేశానికి పట్టు గొమ్మలు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్టు. కానీ, గత మూడేళ్లుగా గ్రామ పంచాయితీల ఆదాయం గణనీయంగా తగ్గినట్టు  రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పంచాయితీరాజ్ ఫైనాన్స్ నివేదికలో పేర్కొన్నది. 2020 ఆర్థిక సంవత్సరం నుంచి 2022 ఆర్థిక సంవత్సరం వరకు తెలంగాణలోని గ్రామ పంచాయితీల మొత్తం ఆదాయం తగ్గినట్టు తెలిపింది. క్రమంగా గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో గ్రామ పంచాయితీల ఆదాయం క్షీణించిందని నివేదికలో వెల్లడించింది. ఒక్కో పంచాయితీకి రూ.20.36 లక్షలుగా ఉన్న ఆదాయం మూడేళ్లలో రూ.11.52 లక్షలకు అంటే సుమారు 50 శాతం ఆదాయం పడిపోయినట్లు పేర్కొంది. సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం 2020 రూ.81,867 ఉండగా 2021 రూ. 94,653 పెరిగినట్లు తన నివేదికలో వెల్లడించింది. అయితే, 2022 25 శాతం క్షీణించి రూ.72,257కి చేరుకుందని స్పష్టం చేసింది. ఈ మధ్యకాలంలో ఒక్కో పంచాయితీ ఆదాయం రూ. 83,939 నుంచి రూ. 63,187కు పడిపోయిందని వెల్లడించింది.

పంచాయితీల సొంత పన్నేతర ఆదాయం విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్టు వెల్లడించింది. రెవెన్యూ విషయంలో గ్రామ పంచాయితీల వ్యయం మూడేళ్ళ కాలంలో రూ.16.5 లక్షల నుంచి రూ. 11 లక్షలకు తగ్గిందని తెలిపింది. ఖర్చులో అధిక భాగం పంచాయితీల అభివృద్ధిపైనే పెడుతున్నట్లు వెల్లడించింది. కాగా, 2020 ఒక్కో గ్రామ పంచాయితీకి 5.10 లక్షల రూపాయల ఆదాయం ఉండగా.. 2022 కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు గణనీయంగా రూ.1.83 లక్షలకు పడిపోయినట్లు తెలిపింది. ఈ కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రాంట్లు కూడా ఒక్కో పంచాయితీకి రూ.13.6 లక్షల నుంచి 8.29 లక్షల వరకు తగ్గినట్లు నివేదిక పేర్కొంది. తమిళనాడు, హిమాచాల్ ప్రదేశ్, మహరాష్ట్రలోని పంచాయితీలతో పాటు తెలంగాణలోని పంచాయితీలకు ఇతర రాష్ట్రాలలోని పంచాయితీల కంటే పన్నేతర ఆదాయాలు ఎక్కువగా ఉన్నాయని నివేదిక తెలిపింది. పంచాయితీలు అధికంగా సొంత ఆదాయాన్ని ఆర్జించగలిగిన  రాష్ట్రాలలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్లు స్పష్టం చేసింది.