3 August, 2026 | 12:27 AM

మంత్రివర్గ నిర్ణయంతోనే అదనంగా 6 వెంట్లు

24-08-2024 12:57 AM
  1. డిజైన్‌లో లేకున్నా సుందిళ్ల రెండో బ్లాక్- ఏలో అదనపు వెంట్లు
  2. జస్టిస్ పీసీఘోష్ కమిషన్‌కు సీడీవో ఎస్‌ఈ ఫజల్ వెల్లడి

హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): డిజైన్లలో పేర్కొన్నవాటిని కాకుం డా కేవలం మంత్రివర్గ నిర్ణయంతో అదనంగా వెంట్లు నిర్మించారని కాళేశ్వరంపై ఏర్పాటుచేసిన జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ ముందు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) ఎస్‌ఈ ఫజల్ పేర్కొన్నారు. కాళేశ్వరంపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు శుక్రవారం సీడీవో ఎస్‌ఈ ఫజల్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై కమిషన్ ప్రశ్నలు సంధించింది. వీటికి సమాధానంగా పలు కీలక అంశాలను వెల్లడించారు. సుందిళ్ల బరాజ్‌లోని రెండో బ్లాక్-ఏలో అదనంగా 6 వెంట్లు నిర్మించారని వెల్లడించారు. వాస్తవానికి అవి డిజైన్లలో లేవని, మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం మేరకు అదనంగా 6 వెంట్లు వేసినట్టు స్పష్టంచేశారు. క్రాస్ సెక్షన్లను కాళేశ్వరం సీఈ నివేదిక మేరకే ఆమో దించినట్టు కూడా చెప్పినట్టు సమాచారం. దీంతోపాటు మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో సీకెంట్ ఫైల్‌కు వెళ్లాలని కాళేశ్వరం సీఈయే చెప్పారని ఎస్‌ఈ కమిషన్ ఎదుట వెల్లడించారు. 

రెండు లేఖలను అందించిన సీడీవో మాజీ ఈఎన్సీ

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు శుక్రవారం కూడా సీడీవో మాజీ ఈఎన్సీ నరేందర్‌రెడ్డి హాజరయ్యారు. గురువారం విచారణకు కొనసాగింపుగా శుక్రవారం కూడా ఆయన హాజరైనట్టు సమాచారం. ఈ సందర్భంగా కమిషన్ అడిగిన ప్రశ్నలకు సాంకేతికాంశాలతో సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా రెండు లేఖలను కూడా సాక్ష్యంగా కమిషన్‌కు అందించినట్టు సమాచారం.