2 May, 2026 | 1:01 AM

మళ్లీ ఎల్‌ఆర్‌ఎస్ !

02-05-2026 12:00 AM
  1. మరో అవకాశం ఇచ్చిన ప్రభుత్వం
  2. 25శాతం ఫీజు రాయితీ వర్తింపు
  3. మే 1నుంచి జూలై 31వరకు ఛాన్స్
  4. బల్దియాకు చేకూరనున్న ఆదాయం

సంగారెడ్డి, మే 1(విజయక్రాంతి): జిల్లాలోని అక్రమ, అనధికార లేఅవుట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. ఎల్‌ఆర్‌ఎస్-2020 స్కీం కింద ఫీజులో 25 శాతం రాయితీ కల్పిస్తూ ఈ నెల 1నుంచి జూలై 31 వరకు గడువు విధించింది.

గత రెండు విడతల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీలలో దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చినా ఫీజు చెల్లింపునకు మాత్రం ఆశించినంత స్పందన రాలేదు. ఇందుకు బల్దియా అధికారుల అలసత్వం కూడా ఉందనే ఆరోపణలున్నాయి. ప్లాట్ల క్షేత్రస్థాయి పరిశీలనను నిర్లక్ష్యం చేస్తుండడంతో పాటు ఫీజు చెల్లించిన వారికి ఎల్‌ఆర్‌ఎస్ ప్రొసీడింగ్ ఆర్డర్ల జారీలో తీవ్ర జాప్యం జరగడంతోనే ప్రక్రియ ఆశాజనకంగా సాగలేదు.

మూడోసారి ముందుకుపోయేనా?

అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇంటి నిర్మాణ అనుమతులకు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ అమలు చేసింది. 2020లో మీ సేవా కేంద్రాల్లో రూ. వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారి ప్లాట్లను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. 25 శాతం రాయితీ కల్పిస్తూ ఫీజు చెల్లింపునకు తొలుత రెండు నెలల పాటు అవకాశమిచ్చింది. దీంతో బల్దియాకు భారీగా ఆదాయం సమకూరుతుందని భావించినా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు.

ఫీజు చెల్లింపులో సాంకేతిక సమస్యలు తలెత్తడం, పలు ప్లాట్లను నిషేధిత భూముల జాబితాలో చూపడం, వాటిని సరిదిద్దాల్సిన అధికారుల మధ్య సమన్వయం కొరవడటం, చాలామంది ప్లాట్లు విక్రయించడం, కొనుగోలు చేసినవారు ఎల్‌ఆర్‌ఎస్ చేస్తే తమకు ఎలాంటి ఇబ్బంది వస్తుందోనని వెనుకడుగు వేయడంలాంటి కారణాలతోనే ఈ పరిస్థితి తలెత్తింది. ఫలితంగా ప్రభుత్వం మరోసారి గతేడాది జూన్ నెలాఖరు వరకు ఫీజు చెల్లింపు గడువు పొడిగించింది. ఈ రెండు విడతల్లోనూ ప్లాట్ల యజమానుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. దీంతో తాజాగా ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తూ మరోమారు ఉత్తర్వులు జారీ చేసింది.

సంగారెడ్డి జిల్లాలో ఇలా...

సంగారెడ్డి మున్సిపాలిటీ లో ప్లాట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నవారిలో సగంలో సగం మంది కూడా ఫీజు చెల్లించలేదు. మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా ప్లాట్ల పరిశీలన చేపట్టి నిబంధనల మేరకు క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే, ఈ ప్రక్రియ ఆశించినస్థాయిలో జరగలేదనే ఆరోపణలున్నాయి. సంగారెడ్డి మున్సిపాలిటీలో 11,352 దరఖాస్తులు రాగా 4,009 దరఖాస్తులు పరిష్కరించారు. ఇందులో 2,793 ప్రొసీడింగ్లు మంజూరు చేశారు.

ఇంకా 1,216 పెండింగ్ పెట్టారు. మొత్తంగా 7,343 దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.12.34 కోట్ల ఆదాయం మున్సిపాలిటీకి వచ్చిందని అధికారులు తెలిపారు. అలాగే  జహీరాబాద్ మున్సిపాలిటీలో 9,984 దరఖాస్తులు రాగా అందులో 5,894 పరిష్కరించారు. సదాశివపేట మున్సిపాలిటీలో 3,500 దరఖాస్తులకు గాను, 1,920 పరిష్కరించారు.

ఆందోల్ - జోగిపేటలో 303 దరఖాస్తులకు 177, నారాయణఖేడ్లో 3,644 దరఖాస్తులకు 1,032, బొల్లారం మున్సిపాలిటీలో 941 దరఖాస్తులకు గాను 86 దరఖాస్తులు పరిష్కరించారు. మొత్తంగా కొత్త మున్సిపాలిటీలు కాకుండా జిల్లాలో 8 మున్సిపాలిటీలలో 29,303 దరఖాస్తులు రాగా, 16,759 పరిష్కరించారు. మిగతా 12,544 దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉంది. గత రెండు విడతల్లో జరిగిన పొరపాట్లకు తావివ్వ కుండా ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేలా చూడాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

అవకాశాన్ని సద్వినియోగంచేసుకోవాలి..

ప్రభుత్వం మూడోసారి ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియకు అవకాశం ఇచ్చింది. ఫీజులో కూడా 25% రాయితీ ప్రకటించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పెండింగ్ దరఖాస్తులను త్వరలో పూర్తి చేస్తాం.

- శ్రీనివాస్ రెడ్డి, కమిషనర్, సంగారెడ్డి