13 May, 2026 | 2:06 AM

ఎస్సీ క్రిస్టియన్లకు హక్కులు కల్పించాల్సిందే

13-05-2026 01:36 AM
  1. మతం మారినా కులం మారదు
  2. క్రిస్టియన్ కో ఆర్డినేషన్ కౌన్సిల్ సమావేశంలో మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు

విశాఖపట్నం/ద్వారకానగర్, మే 12: మతం మారినా కుల వివక్ష పోదని, రెల్లి, మాల, మాదిగ క్రిస్టియన్లు సామాజికంగా ఇప్పటికీ అదే అణచివేత, అంటరానితనాన్ని ఎదుర్కొంటున్నందున వారికి ఎస్సీ హోదా తప్పనిసరిగా కల్పించాలని ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త, మాజీ డీజీపీ డాక్టర్ జె. పూర్ణచంద్రరావు డిమాండ్ చేశారు. ద్వారకానగర్‌లోని పబ్లిక్ లైబ్రరీలో క్రిస్టియన్ కో ఆర్డినేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.

ఈ కార్యక్రమాన్ని పాస్టర్లు బాబ్జీ, జార్జ్, రాజ్కుమార్, ప్రొఫెసర్ ఎన్‌ఏడీ పాల్, హైకోర్టు న్యాయవాది జెస్సికా నిర్వహించారు. పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. మతం మారినా కులం మారదు. రెల్లి, మాల, మాదిగ క్రిస్టియన్లు చర్చిల్లో, గ్రామాల్లో, సామాజిక సంబంధాల్లో ఇప్పటికీ కుల వివక్షనే ఎదుర్కొంటున్నారు. కాబట్టి వారికి ఎస్సీ హోదా ఇవ్వకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని అన్నారు. రెండు పాలక కులాల ఆధిపత్య రాజకీయాల వల్లే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.

బీసీల రిజర్వేషన్ల సమస్య, ముస్లింలపై ఒత్తిళ్లు, వక్ఫ్ బోర్డులో ప్రభుత్వ జోక్యం, పోలవరం ముంపు కారణంగా ఆదివాసీ గ్రామాల నిర్వాసిత సమస్యలు, పేదరికం, నాణ్యమైన విద్యవైద్యం అందకపోవడం వంటి అంశాలతో ప్రజల జీవన పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పట్టణ జనాభాలో దాదాపు 36 శాతం మంది స్లమ్‌లో నివసిస్తున్నారని, విశాఖపట్నంలో ఈ శాతం 44 వరకు ఉందని తెలిపారు. చంద్రబాబు నాయుడు విజనరీ అంటున్నారు.

జగన్ కూడా ఐదేళ్లు పాలించారు. కానీ పీఎం పాలెం ఆర్హెచ్ కాలనీలో 15 ఏళ్లుగా పేదలకు ఇళ్ల పట్టాలు లేవు.. పక్కా ఇళ్లు లేవు. ఇదేనా అభివృద్ధి? అని ప్రశ్నించారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ సంవత్సరాలుగా పెండింగ్లో ఉందని గుర్తుచేశారు. జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు వెంటనే స్పందించి ఆర్హెచ్ కాలనీ స్లమ్వాసులకు భూ పట్టాలు, పక్కా ఇళ్లు, తాగునీరు, రోడ్లు, కాలువలు, ఆరోగ్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.