వీడిన రిషికొండ రహస్యం
- విశాఖలో ఎమ్మెల్యే గంటా ఆధ్వర్యంలో నిర్మాణాల పరిశీలన
- రూ.500 కోట్లతో నిర్మాణం.. బాత్ టబ్ ఖర్చే రూ.26 లక్షలు!
- ప్రజాధనంతో రాజభవనాలను కట్టిన జగన్ : టీడీపీ
హైదరాబాద్, మే 16( విజయక్రాంతి) : ఏపీలో వైసీపీ ప్రభుత్వం హయాంలో విశాఖలోని రిషికొండపై కట్టిన విలాసవంతమైన భవనాల రహస్యం వీడింది. ఆదివారం భీమి లీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యం లో ఎన్టీయే కూటమి నేతలు రిషికొండను సందర్శించారు. అక్కడి నిర్మాణాలను పరిశీలించారు. దీంతో రిషికొండలో అప్పటి ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాల గుట్టు బహిర్గతమైంది. పర్యాటకుల కోసం గతంలో నిర్మిం చిన కాటేజీలను కూల్చి అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయం కట్టించినట్లు ఆరోపణలు వెల్లు వెత్తాయి.
విశాఖ నుంచి పాలన సాగిస్తానని రిషికొండను బోడిగుండులా మార్చాడని జగన్‌పై ప్రతిపక్ష టీడీపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఇతరులను ఆ ప్రాంతానికి అనుమతించకపోవడంపై నిరసన వ్యక్తం చేసింది. తాజాగా, అధికారంలోకి వచ్చిన టీడీపీ రిషికొండ రహస్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. కూటమి నేతలు రిషికొండపై గల నిర్మాణాలను చూసి అవాక్కయారు.
గాలి జనార్దన్ రెడ్డి భవనాలకు మించి
గాలి జనార్దన్ రెడ్డి, సద్దాం హుస్సేన్‌ల నివాసాలకు మించి రిషికొండపై వైఎస్ జగన్ ప్యాలెస్ కట్టారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. దాదాపు 61ఎకరాల్లో ఏడు బ్లాకులను నిర్మించినట్లు చెప్పా రు. లాభాలను తెచ్చే టూరిజం కాటేజీలను కూల్చి, జగన్‌రెడ్డి రాజభవనాలను కట్టారని విమర్శించారు. గతంలో చంద్రబాబు కట్టిన ప్రజావేదికకు అనుమతి లేదని కూల్చిన జగన్, రిషికొండపై నిర్మాణాలకు ఏం అనుమతులు ఉన్నాయో చెప్పాలని సవాల్ విసిరారు. ఈ భవనాలను ఏం చేయాలో సీఎం చంద్రబాబును అడిగి తెలుసుకుంటామని పేర్కొన్నారు. విశాఖను పరిపాలన రాజధాని అని జగన్ చెప్పినా ప్రజలు నమ్మలేదని, అందుకే ఇక్కడ కూటమి నేతలను అధిక మెజార్టీతో గెలిపించారని అన్నారు.
రూ.500 కోట్లతో జగన్ జల్సా భవనం
రిషికొండపై జగన్ రూ.500 కోట్లతో జల్సా భవనాన్ని కట్టుకు న్నారని టీడీపీ విమర్శలు గుప్పించింది. ఆ ప్యాలెస్‌లోని బాత్ టబ్ ఖరీదు రూ.26లక్షలు ఉంటుందని టీడీపీ ట్వీట్ చేసింది. రిషికొండ ప్యాలెస్ భవనంలో వాడిన ఇటాలియన్ మార్బుల్స్, టైల్స్ చూస్తే దిమ్మదిరిగి పోతోందని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దేశాధినేతలు కట్టుకునే రాజప్రాసాదాలకు వాడే మెటీరియల్‌తో జగన్ రెడ్డి రిషికొండలో విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నారని ఆరోపించింది.






