హెచ్చరికలు లెక్కచేయక!
- రాష్ట్రంలో పెరుగుతున్న మద్యం, పొగాకు వినియోగం
- కొన్ని జిల్లాల్లో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ
- జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడి
- రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి, నిజామాబాద్ జిల్లాల్లో మహిళల్లో మద్యం వేగంగా పెరుగుతున్న వైనం
- ఆదిలాబాద్, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మహిళల్లో పొగాకు వినియోగం పెరుగుదల
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): ఆరోగ్యానికి హానికరం అని ముద్రించినా మద్యపానం, ధూమపానం ఆగడం లేదు. ప్రాణాంతక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందనే హెచ్చరికలను లెక్కచేయకుండా మద్యం, పొగాకు సేవనం జోరుగా సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. తెలంగాణ రాష్ట్రం(Telangana State)లో మద్యం, పొగాకు వినియోగం పెరుగుతున్నట్లు గణంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ విషయంలో పురుషులతో పాటు మహిళలు కూడా పోటీపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 2026 ఆగస్టులో విడుదల చేసిన 6వ జాతీయ కుటుం బ ఆరోగ్య సర్వే (2023లో తెలంగాణ గణాంకాలు విస్తుగొల్పుతున్నాయి.
మహిళల్లో పెరుగుదల..
తెలంగాణ రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుంటే 15 ఏండ్లు, అంతకంటే వయస్సు ఎక్కువున్న మహిళల్లో పొగాకు వినియోగం 2019 5.6 శాతం ఉండగా, 2023 నాటికి 5.9 శాతానికి పెరగడం గమనార్హం. అదే సమయంలో పురుషుల్లో (15 ఏండ్లు, ఆపైబడి) మాత్రం 22.3 శాతం నుంచి 21.1 శాతానికి పొగాకు వినియోగించేవారు తగ్గడం గమనార్హం. అలాగే మద్యం సేవించే (15 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు) వారి విషయంలో.. మహిళల్లో 6.7 శాతం నుంచి 7.1 శాతానికి పెరగ్గా.. పురుషుల్లో 43.4 శాతం నుంచి 43.9 శాతానికి అంటే.. 0.5 శాతం పెరగినట్టుగా సర్వేలో వెల్లడయ్యింది.
మహిళలదే పైచేయి..
ఇక జిల్లాల వారీగా చూసుకుంటే.. మహిళల్లో పొగాకు వినియోగం ఆదిలాబాద్ జిల్లా లో అత్యధిక శాతం పెరుగుదల ఉన్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. 2019 ఆదిలాబాద్ జిల్లాలో పొగాకు వినియోగించే మహిళల శాతం 11.0 శాతం ఉండగా.. అదికాస్తా.. 2023 నాటికి 14.9 శాతం అంటే 3.9 శాతం పెరిగింది. పొగాకు వినియోగం మహిళల్లో పెరిగిన జిల్లాల్లో కొత్తగూడెం, నాగర్‌కర్నూల్ (1 శాతం), జగిత్యాల (0.9 శాతం), కామారెడ్డి (0.8 శాతం)లు ముందంజలో ఉన్నాయి. ఇదే పొగాకు విషయంలో పురుషుల్లో వచ్చేసరికి హన్మకొండ జిల్లాలో అత్యధికంగా 1.9 శాతం పెరుగుదల ఉండగా ఆదిలాబాద్‌లో (0.8 శాతం) మాత్రమే ఎక్కువగా నమోదయ్యింది. మిగతా దాదాపు అన్ని జిల్లాల్లోనూ పురుషుల్లో పొగాకు వినియోగం తగ్గుతున్న సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి.
మద్యంలోనూ మహిళలే..
రాష్ట్రవ్యాప్తంగా మద్యం సేవించడంలో పురుషులతోపాటు మహిళల్లోనూ పెరుగుతున్న సంకేతాలు కనపడుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో అత్యధిక పెరుగుదల నమోదవ్వడం ప్రస్తావనార్హం. 2019 కుటుంబ ఆరోగ్య సర్వే రంగారెడ్డి జిల్లా మహిళల్లో మద్యం సేవించడం 6.7 శాతం ఉండగా, 2023 నాటికి (జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 12.9 శాతానికి చేరుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అదే సమయంలో రంగారెడ్డి జిల్లాలో మద్యం సేవిస్తున్న పురుషుల (15 ఏండ్లకుపైబడి) శాతం 46.8 నుంచి 49.9కి పెరిగింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో మహిళల్లో 11.8 శాతం నుంచి 15.6 శాతానికి మద్యం సేవించడం పెరిగితే.. పురుషుల్లో మాత్రం 55.5 శాతం నుంచి 49.6 శాతానికి తగ్గడాన్ని గమనించవచ్చు. అంటే నాగర్‌కర్నూల్ జిల్లాలో పురుషుల్లో మద్యం సేవించడం 5.9 శాతం తగ్గగా.. అదే మహిళల్లో మాత్రం 3.8 శాతం పెరగడం గమనార్హం.
పురుషుల్లో సగం మంది..
రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. రోజురోజుకూ మద్యం సేవించడం పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పురుషుల్లో (15 ఏండ్లకుపైబడి) సగం మంది.. అంతకంటే ఎక్కువ మంది మద్యం సేవిస్తున్నట్టుగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడయ్యింది. ఇందులో మొదటి స్థానంలో జనగాం జిల్లా నిలిచింది. జాతీయ ఆరోగ్య సర్వే (2019 జనగాం జిల్లాలో 60.6 శాతం పురుషులు మద్యం సేవిస్తున్నట్టు తేలగా.. అదికాస్తా జాతీయ ఆరోగ్య సర్వే (2023 నాటికి 61.6 శాతానికి పెరిగింది.
అంటే జనగాం జిల్లాలో ఉన్న పురుషుల్లో అత్యధిక మంది మద్యం తాగేవారే ఉన్నట్టుగా అర్థమవుతోంది. అలాగే.. ఇతర జిల్లాల్లో మద్యం సేవించే పురుషుల్లో భూపాలపల్లిలో 56.6 శాతం మంది, మహబూబాబాద్ 52.4 శాతం మంది, సిద్ధిపేట 52.5 శాతం మంది, ములుగులో 50 శాతం మంది, నల్గొండ 50.4 శాతం మంది, సిరిసిల్లా 52.1 శాతం మంది, వరంగల్ 56.5 శాతం మంది, యాదాద్రి భువనగిరిలో 54.1 శాతం మంది మద్యానికి బానిసలుగా గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయి.
మెరుగుపడుతోన్న మెదక్
రాష్ట్రంలోని జిల్లాల వారీగా చూసుకుంటే.. విభిన్న పరిస్థితులు కనపడుతున్నాయి. అయితే మెదక్ జిల్లాలో మాత్రం పొగాకు, మద్యం తీసుకునే.. మహిళలు, పురుషుల్లోనూ గణనీయంగా తగ్గుదల నమోదవుతుండగం ప్రస్తావించాల్సిన అంశం. 2019 మెదక్ జిల్లాలో మహిళల్లో అత్యధికంగా మద్యం సేవించేవారు (23.8 శాతం) ఉండేవారు. అదికాస్తా.. 2023 (జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నాటికి 15.2 శాతానికి పడిపోవడాన్ని గమనించవచ్చు. అదే సమయంలో పురుషుల్లోనూ.. 54 శాతం నుంచి 48 శాతానికి మద్యం సేవించేవారి శాతం తగ్గింది.
అలాగే పొగాకు ఉపయోగించే పురుషుల శాతంకూడా 26.2 శాతం నుంచి 22.8 శాతానికి, మహిళలు 6.4 శాతం నుంచి 6.2 శాతానికి తగ్గింది. అంటే ఓవరాల్‌గా మెదక్ జిల్లాలో మాత్రమే.. అటు పొగాకు, ఇటు మద్యం విషయంలో బానిసలు అవుతున్న పురుషులు, మహిళల శాతం తగ్గినట్టుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి అంశం.. మరో నాల్గుదు జిల్లాలు ఉన్నప్పటికీ.. చాలా స్వల్పంగా ఈ తగ్గుదల ఉంది. మొత్తంగా రాష్ట్రంలో పొగాకు వినియోగంలో మహిళల్లో పెరుగుదల నమోదవ్వగా పురుషుల్లో తగ్గుతోంది. అలాగే మద్యంలో అటు పురుషులతోపాటు మహిళల్లోనూ పెరుగుదలే నమోదయ్యింది.
