హత్యల కంటే రోడ్డు ప్రమాదాల మరణాలే ఎక్కువ
గ్రేహౌండ్స్ అండ్ ఆక్టోపస్ ఆపరేషన్ అదనపు డీజీపీ అనిల్‌కుమార్
ఆదిలాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): దేశంలో హత్యల కంటే రోడ్డు ప్రమాదాలే ఎక్కువగా జరుగుతున్నాయని, ముఖ్యంగా పాదచారులు, ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని రాష్ట్ర గ్రేహౌండ్స్ అండ్ ఆక్టోపస్ ఆపరేషన్ అదనపు డీజీపీ డా. అనిల్ కుమా ర్ అన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వారం రోజులపాటు నిర్వహిస్తు న్న ‘అరైవ్ అలైవ్‘ అనే కార్యక్రమాలలో భాగంగా స్థానిక రిమ్స్ ఆసుపత్రిలోని ఆడిటోరియంలో నిర్వహించిన రోడ్ సేఫ్టీ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించగా 25 మంది డ్రైవర్లకు ఉచితంగా కంటి అద్దాలు అందించారు. అదేవిధం గా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పిల్లలకు హెల్మెట్‌ను ధరించారు. అనంతరం రాష్ట్ర గ్రేహౌండ్స్ అండ్ ఆక్టోపస్ ఆపరేషన్ అదనపు డీజీపీ డా.అనిల్ కుమార్ మాట్లాడుతూ 38 గ్రామాల్లో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాల పాలనపై తీర్మానాలు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ ఏడాది జిల్లా పోలీసుల లక్ష్యం రోడ్డు ప్రమాదాలలో మరణాలను కనీసం 20% తగ్గించడం అని వెల్లడించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని, అందరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, పరిపాలన అడిషనల్ ఎస్పీ మౌనిక, శిక్షణ ఐపిఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, జీవన్ రెడ్డి, డాక్టర్స్, పట్టణ సీఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు, పాల్గొన్నారు.






