27 August, 2026 | 11:08 AM

కంకరపరిచి రోడ్డు నిర్మాణం మరిచి!

27-08-2026 12:00 AM

శంకుస్థాపనలకే పరిమితమైన రహదారులు

పట్టించుకోని పాలకులు

వెల్దండ, ఆగస్టు 26: పాలకులు మారుతున్నా, ప్రభుత్వాలు మారుతున్నా మండలంలోని రహదారుల పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ శాఖ నుంచి నిధులు మంజూరై శంకుస్థాపనలు చేసినా పనులు మాత్రం ముందుకు సాగడం లేదని తండావాసులు ఆరోపిస్తున్నారు.

2022-23లో బైరాపూర్ నుంచి కుందారం తండా బీటీ రోడ్డుకు రూ.1.40 కోట్లు, కలకొండ నుంచి రోడ్డుకు రూ.2.60 కోట్లు మంజూరు కాగా శంకుస్థాపన చేసి కంకర పరిచినప్పటికీ నిర్మాణ పనులు పూర్తికాలేదని తెలిపారు. దీంతో వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

గొల్లపల్లిమరుగుదొండ రోడ్డుకు రూ.42 లక్షలు, దొంగ రోడ్డుకొత్త తండాకు రూ.35 లక్షలు, గుండాలఅల్లంతోట బాయి తండా రోడ్డుకు రూ.2.10 కోట్లు, రాసూర్ తండా రోడ్డుకు రూ.50 లక్షలు, శంకర్కొండ తండా బీటీ రోడ్డుకు రూ.2.10 కోట్లు, వెల్దండరాచూరు రోడ్డుకు రూ.40 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. అయితే శంకుస్థాపనలు జరిగి ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని పెండింగ్లో ఉన్న రహదారి పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని ఆయా గ్రామాలు, తండాల ప్రజలు కోరుతున్నారు.