రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత
ఆర్టీవో కార్యాలయంలో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్
ఖమ్మం, ఏప్రిల్ -17 (విజయక్రాంతి): రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా రవాణాధికారి కార్యాలయంలో నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం మునిసిపల్ కార్పోరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ, లా అండ్ ఆర్డర్ అదనపు డిసిపి ప్రసాదరావు లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అంతకు ముందు ఆర్టీఓ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. రాహ-వీర్, పిఎం రాహత్ అనే రెండు కొత్త పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రమాద బాధితులను గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి తరలించిన వారికి రాహ-వీర్ పథకం క్రింద 25 వేలు ప్రోత్సాహకంగా అందజేస్తామని తెలిపారు.
పీఎం రాహత్ పథకం క్రింద ప్రమాద బాధితులకు లక్షన్నర వరకు నగదు రహిత చికిత్సను పూర్తిగా ఉచితంగా అందిస్తామని వివరించారు. ఈ పథకాలు గోల్డెన్ అవర్ను సమర్థవంతంగా వినియోగించేందుకు తీసుకొచ్చినవని తెలిపారు. సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించడం మన రక్షణ కోసమేనని, వాటిని తప్పించుకోవాలని ప్రయత్నించడం సరికాదని సూచించారు.
కారులో ప్రయాణించే సమయంలో డ్రైవర్ మాత్రమే కాకుండా ప్రయాణికులు కూడా తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని తెలిపారు. ఖమ్మం జిల్లాలో టాప్ 30 యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్లను గుర్తించి సరిదిద్దినట్లు తెలిపారు. దీని వల్ల ప్రమాదాలు తగ్గి ఈ ఏడాది 15 మంది ప్రాణనష్టం తగ్గిందని అన్నారు. మరిన్ని బ్లాక్ స్పాట్లను గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.






