రోడ్డు భద్రత చర్యలు పాటించాలి
మహబూబాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): అరైవ్ అలైవ్ 2026 కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గూడూరు మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు హెల్మెట్లు ధరించి ఎస్పీకి స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అంబేద్కర్135వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు కలిసి రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలనే ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాపాయానికి దారితీస్తుందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ వంటి భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఇంటినుంచి బయటకు వెళ్లే ప్రతి వ్యక్తి తన కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తూ జాగ్రత్తగా వాహనం నడపాలని, ట్రాఫిక్ పోలీసులు ఉన్నా లేకపోయినా నియమాలను పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు, డిఎస్పీ అడ్మిన్ గండ్రతి మోహన్,గూడూరు సీఐ విజయ్ కుమార్, ఎస్.ఐ గిరిధర్, స్థానిక సర్పంచ్, ఉపసర్పంచ్, ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.






