రోడ్డు భద్రత సామాజిక బాధ్యతగా భావించాలి
మంగపేటలో అరైవ్ అలైవ్ కార్యక్రం
మంగపేట, ఏప్రిల్ 14 (విజయక్రాంతి) : రోడ్డుపై వెళ్లే ప్రతి వాహనదారుడు సామాజిక బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని మంగపేట ఎస్త్స్ర టి.వి.ఆర్.సూరి, రెండవ ఎస్త్స్ర శ్రీకాంత్ లు అన్నారు. మంగపేట మండల కేంద్రంలోని తెలంగాణా సెంటర్ లో మంగపేట పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం అరైవ్ అలైవ్ ( రోడ్డు భద్రత ) పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యతనిస్తూ అమలు చేస్తున్న అరైవ్ అలైవ్ (రోడ్డు భద్రత) కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి, వాహనదారులతో, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంగపేట ఎస్త్స్ర టి.వి.ఆర్.సూరి, రెండవ ఎస్త్స్ర శ్రీకాంత్ లు మాట్లాడుతూ ఒక్క చిన్న తప్పిదం కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెడుతున్నదని అన్నారు.
హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగించడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం వంటి ప్రాథమిక నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అరైవ్ అలైవ్ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించడం అని తెలిపారు. గమ్యస్థానానికి చేరుకోవడం కంటే ముందుగా సురక్షితంగా ఉండటం ముఖ్యమని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని వివరించారు.
ప్రాణ భద్రత ప్రతి ఒక్కరికి అత్యంత ముఖ్యమని తెలిపారు. వాహనాల సాంకేతిక స్థితి సక్రమంగా ఉండేలా చూసుకోవడం, డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని, వేగ పరిమితులను పాటించడం వంటి ప్రాథమిక ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా అనుసరించాలని సూచించారు. సురక్షితంగా ప్రయాణించి క్షేమంగా గమ్యానికి చేరుకోవడమే నిజమైన విజయం అని అన్నారు.
ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ బరువు కాదని భాద్యత అని, హెల్మెట్ ప్రాణాలను కాపాడే ప్రధాన రక్షణ కవచమని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, రోడ్డు భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాకుండా, ప్రతి పౌరుడి కర్తవ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆటో డ్రైవర్లు, వాహనదారులు, ప్రజలు పాల్గొన్నారు.






