3 August, 2026 | 4:25 PM

అస్తవ్యస్తంగా రోడ్డు పనులు

03-08-2026 03:53 PM

ఇంకెన్నాళ్ళు సాగదీస్తారు

బిజెపి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ 

చెన్నూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణ కేంద్రంలో చేపట్టిన రోడ్డు వెడల్పు పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయని, ఈ సాగదీత పనులు ఇంకెన్నాళ్లని బిజెపి జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పాలకులను ప్రశ్నించారు. సోమ వారం బిజేపి పార్టీ నాయకులతో కలిసి అంబేద్కర్ చౌక్ నుంచి రావిచెట్టు వరకు చేపట్టిన  రోడ్డు పనులను  పరిశీలించారు. బాధితుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యంపై మంత్రి వివేక్ వెంకటస్వామి, మున్సిపల్ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమై మూడు నెలలు గడిచినా డ్రైనేజీ, ప్రధాన రహదారి పనులు పూర్తిస్థాయిలో ముందుకు సాగడం లేదన్నారు. దీంతో ఆ ప్రాంతంలోని వ్యాపారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

రోడ్డును ఎంత వెడల్పు చేస్తున్నారనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదని, డ్రైనేజీ వ్యవస్థ, సర్కిళ్లు, లైటింగ్ ఏర్పాటు తదితర అంశాలపై అధికారులు ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రధాన రహదారిని ఒకే విధంగా విస్తరించకుండా ఒకచోట ఒకలా, మరోచోట మరోలా పనులు చేపడుతున్నారని ఆరోపించారు. ఇందులో మున్సిపల్ అధికారుల ఉద్దేశం ఏమిటో ప్రజలకు తెలియజేయాలని కోరారు. మంత్రి వివేక్ వెంకటస్వామి తన సొంత నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సరైన అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

స్వల్ప వర్షానికే డ్రైనేజీ నీరు పేదల ఇళ్లలోకి చేరి దుర్వాసన వెదజల్లుతోందని, అయినప్పటికీ మంత్రి, అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇప్పటికైనా మంత్రి స్పందించి రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, వ్యాపారులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఆయన  వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలున్నారు.