గ్రేటర్‌లో రోడ్లకు మరమ్మతులు చేయాలి
-కనీస అవసరాలపై సత్వర చర్యలు తీసుకోవాలి
-అధికారులకు డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత ఆదేశాలు
హైదరాబాద్, సిటీ బ్యూరో నవంబర్ 23 (విజయక్రాంతి): గ్రేటర్‌లో దెబ్బతిన్న రోడ్లకు, రోడ్లపై గుంతలకు వెంటనే మరమ్మతులు చేయాలని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ సమగ్రాభివృద్ధిపై ప్రభు త్వం ప్రత్యేక దృష్టి సారించిందని, సీఎం రేవంత్‌రెడ్డి, హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మార్గదర్శకత్వంలో నగర రూపురేఖలు మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
శనివారం ఆమె అధికారులతో నగరంలోని పౌర సమస్యలపై సమీక్షించారు. జీహెఎంసీ పరిధిలోని అన్ని డివిజన్లలో రోడ్ల అభివృద్ధి పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ట్రాఫిక్ రద్దీకి, వాహనదారుల ఇబ్బందులకు కారణమవుతున్న దెబ్బతిన్న రోడ్లు, గుంతలను వెంటనే పూడ్చాలని సూచించారు.
అలాగే మురుగునీటి సమస్యలు, వీధి దీపాల నిర్వహణ వంటి కనీస పౌర అవసరాలపై సత్వర చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలని ఆమె అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఫిర్యాదుపై తక్షణ స్పందన ఉండాలని కేవలం స్పందించడమే కాకుండా, ప్రమాణాలతో పనులు పూర్తి చేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ఆమె స్పష్టం చేశారు.
నగరాభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కావాలంటే పౌరులు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం పరస్పర సమన్వయంతో పని చేయాలని మోతే శ్రీలత కోరారు. హైదరాబాద్‌ను ట్రాఫిక్ రహిత, సమస్యల రహిత ఆధునిక మెట్రో నగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం సంకల్పబద్ధంగా ముందుకు సాగుతోందని, దానికి అనుగుణంగా జీహెఎంసీ పనితీరును మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని ఆమె తెలిపారు.






