24-11-2025 12:06:39 AM
చిగురుమామిడిలో ‘ఇందిరా మహిళా శక్తి’ చీరల పంపిణీ
చిగురుమామిడి, నవంబర్ 23(విజయక్రాంతి): మహిళల ఆర్థికాభివృద్దే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్ఘటించారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన చీరలను అందజేశారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మహిళా సంఘాలు సూచించిన మోడల్ చీరలనే పంపిణీ చేస్తున్నామని, ప్రతి మహిళకు చీరలు చేరేలా గ్రామమండల సమాఖ్యలు బాధ్యత వహించాలని మంత్రి సూచించారు. మహిళల ఐక్యతకు సంకేతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వడ్డీ రహిత రుణాలపై వడ్డీని ప్రభుత్వం భరిస్తోందని, రైస్ మిల్లులు, సోలార్ ప్లాంట్లు, క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, బస్సులు వంటి వ్యాపారాల్లో మహిళా సంఘాలకు సహాయం అందిస్తున్నట్లు వివరించారు. పిల్లల చదువుపై మహిళలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
నియోజకవర్గానికి ఇప్పటికే 3,500 ఇండ్లు మంజూరయ్యాయని, మహిళా సంఘాల భవనాలకు త్వరలో నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వకడే, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులుపాల్గొన్నారు.