09-05-2025 03:29:05 AM
వాటికన్ సిటీ, మే 8: ప్రతిష్ఠాత్మక రోమన్ క్యాథలిక్ చర్చి కొత్త పోప్‌గా రాబర్ట్ ఫ్రాన్సిన్ ప్రివోస్ట్ ఎన్నికైనట్టు వాటికన్ సిటీ గురువారం ప్రకటన విడుదల చేసింది. అమెరికాకు చెందిన కార్డినల్ రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్ 267వ క్యాథలిక్ పోప్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్త పోప్‌గా ఎన్నికైన రాబర్ట్ ఫ్రాన్సిస్‌ను ఇకపై ‘పోప్ లియో’గా పిలవనున్నారు. సిస్టిన్ చాపెల్‌లోని కాంక్లేవ్‌లో రెండు రోజులరహస్య విధానంలో జరిగిన ఓటింగ్‌లో పాల్గొన్న 133 మంది కార్డినల్స్ శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రాబర్ట్ ఫ్రాన్సిస్‌ను తదుపరి పోప్‌గా ఎన్నుకున్నారు.
దీనికి సూచనగా ప్రాచీన సిస్టిన్ చాపెల్ చర్చి పొగగొట్టం నుంచి తెలుపురంగు పొగ వెలువడింది. పోప్‌గా ఒక అమెరికన్ ఎన్నికవడం చరిత్రలోనే ఇది తొలిసారి. నూతన పోప్ ఎన్నిక ఖరారుతో ప్రజల హర్షధ్వానాలతో సెయింట్ పీటర్స్ స్కేర్ హోరెత్తింది. అత్యున్నత కార్డినల్ నూతన పోప్ పేరు ప్రకటించారు. తొలుత నూతన పోప్ పుట్టిన పేరును లాటిన్‌లో చదివి, అనంతరం ‘పోప్ లియో’గా నామకరణం చేశారు. అనంతరం కొత్త పోప్ రాబర్ట్ ఫ్రాన్సిస్ సంప్రదాయం ప్రకారం సెంట్ పీటర్స్ బాసిల్లికాలోని సెంట్రల్ బాల్కనీ నుంచి లక్షలాది మందికి అభివాదం చేశారు.
ఎవరీ రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్?
69 ఏళ్ల రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్ అమెరికాలోని చికాగోలో సెప్టెంబర్ 14, 1955న జన్మించారు. 2023 నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ది పొంటిఫికల్ కమిషన్ ఫర్ లాటిన్ అమెరికాకు బిషప్‌గా వ్యవహరిస్తున్నారు. ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆగస్టీన్ సభ్యుడైన రాబర్ట్ ఫ్రాన్సిస్ పెరు మిషనరీలో పదేళ్ల పాటు (2001-2013) వరకు ప్రియర్ జనరల్ ఆఫ్ ఆగస్టీనియన్స్‌గా సేవలందించారు. 2023లో కార్డినల్‌గా.. 2025లో కార్డినల్ బిషప్‌గా ఆయన పదోన్నతి పొందారు.