జర్నలిస్టుల సంక్షేమానికి ప్రతినెలా రూ.లక్ష జమ చేస్తా
- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
నా మొదటి నెల వేతనం జర్నలిస్టుల సంక్షేమ నిధికి అందిస్తా : డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి
మహబూబ్ నగర్, మార్చి 1 ( విజయ క్రాంతి) : ప్రతి సమస్య పరిష్కారం కోసం జర్నలిస్టులు అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ నందు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేయర్ గుమ్మాల మమత, డిప్యూటీ మారేపల్లి సురేందర్ రెడ్డిలకు ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్టులకు ఆపద వస్తే ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ఆ ఆ నిధి నుంచి వారికి పూర్తి సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతినెల లక్ష రూపాయలు విరాళంగా జర్నలిస్టుల సంక్షేమ నిధిలో జమ చేస్తానని స్పష్టం చేశారు. డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల కు ఎప్పుడు ఎలాంటి ఆపద వచ్చిన అండగా ఉంటామని తెలిపారు. తన మొదటి నెల వేతనాన్ని జర్నలిస్టుల సంక్షేమ నిధికి అందజేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నేతలు, జర్నలిస్టులు పాల్గొన్నారు.




