ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆర్టీసీ జేఏసీ ఫైర్
- తదుపరి కార్యాచరణ కోసం ఈ నెల13న భేటీ
హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 5న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు ప్రస్తావించకపోవడం, ప్రభుత్వం ఇచ్చిన హామీలు విస్మరించడం పట్ల జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, కో-చైర్మన్ హనుమంతు ముదిరాజ్, వైస్ చైర్మ న్ ఎం థామస్‌రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో-కన్వీనర్లు కత్తుల యాద య్య, సుద్దాల సురేష్, బి యాదగిరి ఖండించారు.
సోమవారం యూనియన్ కార్యాలయంలో జేఏసీ భేటీ అయ్యింది. కార్మిక సమస్యల పరిష్కారం కోసం కార్మికోద్యమాన్ని ఉధృతం చేయడమే ఏకైక లక్ష్యంగా భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశా రు. ఇందులో భాగంగా జేఏసీలో కలవని ఇతర కార్మిక సంఘాలను కూడా భాగస్వామ్యం చేయడానికి జేఏసీ నిర్ణయించింది. 13న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం నిర్వహిస్తున్నామని జేఏసీ నేతలు తెలిపారు. జేఏసీ ప్రతినిధులు రాఘవులు, కమలాకర్ గౌడ్, నరేందర్, రమేష్, మజీద్, పాపయ్య, కె.ఎస్. పాల్, శ్రీనివాస్, మూర్తి పాల్గొన్నారు.






