14 June, 2026 | 1:43 AM

బతుకునిస్తున్న రైలు బండి

14-06-2026 12:05 AM

హాకర్స్ @ కేసముద్రం

ప్రతి రోజు ఉదయం సూర్యుడు ఉదయించేలోపే వారి జీవన పోరాటం మొదలవుతుంది. రైలు బోగీల్లో  పల్లీ.. పల్లీ.. సమోసా.. సమోసా అంటూ వినిపించే వారి స్వరం వెనుక ఒక కుటుంబ బతుకు గాధ ఉంది. కష్టాలను చిరునవ్వుతో ఎదుర్కొంటూ, ప్రతి రోజూ రైలు బండిలో బతుకు‘బండి’ని ముందుకు సాగిస్తున్నారు. చేతిలో చిన్న బుట్ట, అందులో వేడివేడిగా తయారుచేసిన వేరుశనగ గూళ్లు, ఇతర తినుబండారాలు సమోసాలు, ఉడికించిన బటానీలు, మంచి శనగలు, వేయించిన జంతికలు, మురుకులతో భుజాన బాధ్యతల భారంతో రైలు ఎక్కుతారు.

రైలు వచ్చే సమయానికి వారి అడుగులు రైల్వే స్టేషన్ వైపు పరుగులు పెడతాయి. ప్రయాణికుల ఆకలి తీర్చడం ద్వారా తమ కుటుంబ పోషణ సాగిస్తున్నారు. రోజూ కుటుంబ బాధ్యతల కోసం, ఆకలి తీర్చేందుకు, ఆత్మగౌరవంతో జీవించేందుకు పోరాడుతున్న వందలాది చిరు వ్యాపారుల ప్రతిరూపంగా కేసముద్రం రైల్వే స్టేషన్ నిలుస్తోంది. రైల్వే ప్రయాణికులకు వారు అమ్మే తినుబండారాలకు వచ్చే  పది రూపాయల నోటు వెనుక వారి చెమట చుక్కలు, కుటుంబ సభ్యుల ఆశలు దాగి ఉంటాయి.

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణానికి చెందిన అనేక మంది గత ఎన్నో ఏళ్లుగా ‘హాకర్లు’గా వృత్తిని ఎంచుకొని రైలు బండ్లను తమ జీవనాధా రాన్ని చేసుకొని బతుకుతున్నారు. కేసముద్రం పట్టణ పరిధిలోని బడి తండా, సబ్ స్టేషన్ తండా, బ్రహ్మంగారి తండాతో పాటు ఆయా ప్రాంతాల్లోని అనేక గిరిజన కుటుంబాలకు రైలు బండ్లు జీవనాధారంగా మారాయి. ప్రతిరోజూ తమ ఇంట్లో కాల్చిన, ఉడికించిన వేరుశనగలు, ఉడికించిన శనగలు, బటానీలు, సమోసాలు, జంతికలు, మురుకులు, ఇతర చిరుతిండ్లను బుట్టలో పెట్టుకుని, కేసముద్రం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడకు వచ్చే రైళ్లు ఎక్కి కాజీపేట, విజయవాడ, సికింద్రాబాద్, బల్హర్ష వరకు వెళ్లి, రైళ్లలో అటూ ఇటూ తిరుగుతూ ప్రయాణికులకు విక్రయిస్తారు.

ప్రయాణికులు కొనుగోలు చేస్తేనే ఆ రోజు వారింట్లో పొయ్యి వెలుగుతుంది. వ్యాపారం సాఫీగా సాగితే ఆ రోజుకు రూ.500 నుంచి రూ. 800 వరకు వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు ప్రధాన ఆధారంగా నిలుస్తోంది. ఒక్క కేసముద్రం పట్టణ పరిధిలో సుమారు 500 మంది వరకు హాకర్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఉదయం పూట కాజీపేట వైపు వెళ్లే కాకతీయ ఎక్స్‌ప్రెస్, విజయవాడ వైపు వెళ్లే పుష్‌పుల్ ప్యాసింజర్ ద్వారా వీరి జీవన ప్రయాణం ప్రారంభిస్తారు. కాజీపేటకు వెళ్లిన తర్వాత కొందరు సికింద్రాబాద్, మరికొందరు బల్లార్షా వెళ్లే రైళ్లల్లోకి మారి సాయంత్రం వరకు తిరుగు ప్రయాణంలో కేసముద్రం చేరుకుంటారు. 

చిరు వ్యాపారుల కేసముద్రం 

రోజూ కుటుంబ బాధ్యతల కోసం, ఆకలి తీర్చేందుకు, ఆత్మగౌరవంతో జీవించేందుకు పోరాడుతున్న వందలాది చిరు వ్యాపారుల ప్రతిరూపంగా కేసముద్రం రైల్వే స్టేషన్ నిలుస్తోంది. ప్రయాణికుల చేతిలో పడే ప్రతి పది రూపాయల నోటు వెనుక వారి చెమట చుక్కలు, కుటుంబ సభ్యుల ఆశలు దాగి ఉంటాయి. సమాజం దృష్టిలో చిన్న వ్యాపార మే అయినా, వారికదే జీవనాధారం. రైలు బోగీల్లో  పల్లీ.. పల్లీ.. సమోసా.. సమోసా అంటూ వినిపించే వారి స్వరం వెనుక ఒక కుటుంబ బతుకు గాధ ఉంది. కష్టాలను చిరునవ్వుతో ఎదుర్కొంటూ, ప్రతి రోజూ రైలు బండిలో బతుకు ‘బండి’ని ముందుకు సాగిస్తున్నారు. ‘రైలు వస్తే ఆశ వస్తుం ది... రైలు వెళ్లిపోతే మరోరైలు కోసం ఎదురుచూపులు మొదలవుతాయి. అదే వారికి బతుకు రైలు బండిగా మారింది.

ఖర్చులు పెరిగినా ఆదాయం పెరగడం లేదు

పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, తయారీ ఖర్చులు పెరిగినా తమ ఆదాయం మాత్రం పెరగడం లేదని హాకర్ విజయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. కరోనా కాలం తమ జీవనానికి పెద్ద దెబ్బ కొట్టిందన్నాడు. రైళ్ల రాకపోకలు తగ్గిపోవడంతో ఆదాయం పూర్తిగా  నిలిచిపోయిందని, ఆ సమయంలో కుటుంబ పోషణ కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని గుర్తు చేసుకున్నాడు. అయినప్పటికీ నిరాశ చెందకుండా మళ్లీ రైళ్లను ఆశ్రయించి తన జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పాడు. 

ఇజ్జత్ పాస్ పునరుద్ధరించాలి

రైళ్ల బండిని ఆసరాగా చేసుకుని జీవిస్తున్న అనేకమంది చిరు వ్యాపారులు, హాకర్స్, వెండర్స్, కూలీలకు రైలులో కేవలం నెలకు 25 రూపాయల చార్జీతో యూపీ ఏ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ఇజ్జత్ పాస్’ ఇచ్చింది. రైళ్లలో స్వల్ప చార్జీతో తమ వ్యాపారాలు నిర్వహించడంతోపాటు ఇతర ఉపాధి అవకాశాల కోసం ఎంతో ఉపయో గకరంగా ఉండేది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇజ్జత్ పాసులను తొలగించడంతో హాకర్స్, కూలీలను.. రైల్వే, జీఆర్పీ, టికెట్ తనిఖీ అధికారులు తరచుగా పట్టుకొని జరిమానాలు విధిస్తున్నారు. ఫలితంగా ఆ రోజు తమ రెక్కల కష్టం పూర్తిగా నష్టపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తిరిగి ఇజ్జత్ పాసులను ప్రవేశపెట్టి, ఇబ్బందులు లేకుండా జీవనం సాగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.