25 February, 2026 | 2:44 AM

గళమెత్తిన ఆర్టీసీ కార్మికులు

25-02-2026 01:10 AM

విలీనం, వేతన సవరణ, అలవెన్సులకై..

ఇందిరాపార్కు వద్ద భారీ ధర్నా

  1. వందలాది మంది ఆర్టీసీ కార్మికులు హాజరు
  2. మార్చి 13లోపు తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరిక
  3. మద్దతు పలికిన ఎమ్మెల్యే కూనంనేని, జేఏసీ చైర్మన్ వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి

ముషీరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): తమ దీర్ఘకాలిక పెండింగ్ సమ స్యలను తక్షణమే పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు గళమెత్తారు. మార్చి 13లోపు జేఏసీ ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరించకుంటే అసెంబ్లీని ముట్టడించి సమ్మె నోటీసు జారీ చేస్తామని కార్మిక సంఘ నాయకులు హెచ్చరించారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికుల వేతనాలు సవరించాలని తమకు రావాల్సిన అలవెన్సులను చెల్లించాలని టీజీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో పెద్దఎత్తున ధర్నా జరిగింది. ఈ ధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికులు వందలాదిమంది తరలివచ్చారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నా లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు.

ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లపై వచ్చే అసెంబ్లీ సమావేశాలలో చర్చిస్తామని ఆయ న హామీ ఇచ్చారు. తాను రాజకీయ నాయకుడిని కాదని, కార్మిక నాయకుడినని, కార్మి కులకు అండగా ఉండి సమస్యలు పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆర్టీసి కార్మి కులకు ఆర్ధిక భారం లేని బెనిపిట్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పరిపాలనపై అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం కార్మికుల పక్షాన ఉండాలే తప్ప అధికారుల పక్షం ఉండకూడదన్నారు.

భవన నిర్మాణ కార్మికులకంటే ఆర్టీసీ కార్మికులకు తక్కువ వేతనం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని సీఎం హామీ ఇచ్చారని అన్నారు. హామీ ఇచ్చి రెండు సంవత్సరాలైనా విలీన ప్రక్రియ నేటికి మొదలు కాలే దని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

ఎన్నికల మెనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నేటివరకు నెరవేరకపోవడంతో కార్మికులలో అసంతృప్తి నెలకొందని ఆయన మండిపడ్డారు. తమ న్యాయమైన సమస్యలపై పోరాటం చేయడానికి ఇందిరాపార్కు వద్ద ధర్నా చేస్తామంటే పోలీసులు, ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు. మార్చి 13లోపు ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభు త్వానికి ఇదే చివరి హెచ్చరిక అని ఆయన హెచ్చరించారు.

లేనిపక్షంలో మార్చి 13 తరువాత రాష్ట్రవ్యాప్తం గా మెరుపు సమ్మె చేస్తామని ఆయన హెచ్చరించారు. జేఏసీ వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 2017 వేతన సవరణ ఇచ్చారని, కాని ఆ వేతన సవరణకు సంబంధించిన ఎరియర్స్ నేటికి వరకు చెల్లించలేదన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీని నిర్వీర్యం చేయ డానికి కుట్రలు పన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో వెలుతుందని అన్నారు.

ఆర్టీసీకి రావాల్సిన 2 వేల 350 కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే ఆర్టీసీకి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్లు ఎండీ మౌలానా, కో- కన్వీనర్లు కే యాదయ్య. ఎస్ సురేష్, బీ యాదగిరి, కరుణాకర్‌గౌడ్, కత్తు  యాదయ్య, రాఘవులు, బాల్‌రెడ్డి, బాబు, మహ్మద్ అలీతో పాటు వందలాదిమంది ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.

ఇందిరాపార్కు చౌక్‌లో ఆర్టీసీ కార్మికుల భారీ ధర్నా తో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. చలో సెక్రటేరియేట్ కార్యక్రమానికి కార్మికులు పూనుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వారిని అక్కడే నిలువరించారు. దీంతో కార్మికుల నినాదాలు మిన్నంటాయి.