22-01-2026 01:56:05 AM
డాలర్‌తో పోలిస్తే 91.74కు పడిపోయిన విలువ
బంగారం, వెండి దిగుమతులు పెరగడం ఒక కారణం
న్యూఢిల్లీ, జనవరి 21: అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ రూపాయి మారకం విలువ బుధవారం సరికొత్త రికార్డు స్థాయికి పడిపోయింది. ఇవాళ ట్రేడింగ్‌లో రూపాయి భారీగా నష్టపోయి, ఒక దశలో 91.74 వద్ద ఆల్ టైమ్ కనిష్ఠాన్ని నమోదు చేసింది. మార్కెట్‌లో నెలకొన్న ప్రతికూల పరిణామాల మధ్య ఒక్కరోజే 60 పైసల మేర విలువను కోల్పోయింది. మంగళవారం 90.97 వద్ద ముగిసిన రూపాయి, బుధవారం ఉదయం 91.05 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. ట్రేడింగ్ సాగుతున్న కొద్దీ అమ్మకాల ఒత్తిడి పెరగడంతో రూపా యి విలువ అంతకంతకూ దిగజారింది.
రూపాయి విలువ పడిపోవడం దేశీయ ఆర్థిక వ్యవస్థకు ఒక గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.కరెన్సీ విలువను నిలకడగా ఉంచేందుకు ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడంలేదు. బంగారం, వెండి దిగుమతులు పెరగడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు దేశీయ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను భారీ గా ఉపసంహరించుకోవడం పతనానికి ప్రధాన కారణంగా నిలిచింది. భారత ఈక్వి టీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరిస్తూనే ఉన్నా రు.
ఒకవైపు అమెరికా, యూరప్ మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందన్న వార్తలు వంటి అంతర్జాతీయ అంశాలు కూడా రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. వీటికి తోడు దేశీయ స్టాక్ మార్కెట్‌లో నష్టాల్లో కొనసాగడం రూపాయి విలువను బలహీనపరిచిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఫారెక్స్ వ్యాపారుల అభిప్రాయం మేరకు తాజా యూఎస్ విస్తరణ సంకేతాలతో సహా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు రిస్క్ విముఖతను పెంచాయి.