సిల్వర్ రేస్!
అదే దారిలో పసిడి
కిలో వెండి రూ.3.41 లక్షలు
తులం బంగారం రూ.1.57లక్షలు
ఒక్కరోజులోనే వెండి రూ.11,100వేలు, పసిడి 7,480 పెరుగుదల
న్యూఢిల్లీ, జనవరి 21: వెండి, బంగారం ధరలకు రెక్కలొచ్చి ఆకాశానికి ఎగబాకుతున్నాయి. రోజు రోజుకు ధర పెరగడమే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బుధవారం కిలో వెండి ధర ఏకంగా రూ.3,41,000 పలికింది. మంగళవారానికి రూ.3,30,000 పలికిన ధర, 24 గంటల వ్యవధిలోనే రూ.11,100 మేర పెరగడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి ఇలాగే కొనసాగితే మున్ముం దు కిలో వెండి ధర రూ.4 లక్షల వరకు చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అలాగే బంగారం ధరలు కూడా అదే దారి లో సాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర తులం (10 గ్రాములు) రూ.1,57,260 పలికింది. మంగళవారం ఈ ధర రూ.1,49,780 పలుకగా,24 గంటల వ్యవధిలో రూ.7,480 మేర పెరిగింది. అంతర్జాతీయంగా రాజకీయ ఉద్రిక్తతలు, భౌగోళిక అనిశ్చితి కారణంగానే దేశీయంగా బంగారం, వెండి ధరలు అమాంతం పెరుగుతున్నాయి.




