calender_icon.png 20 January, 2026 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి

20-01-2026 12:22:40 AM

ఎమ్మెల్యే కాలే యాదయ్య

శంషాబాద్, జనవరి 19( విజయక్రాంతి): గ్రామ అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకుని నూతనంగా ఎన్నికైన సర్పంచులు తమ పరిపాలనను సాగించాలని చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య పిలుపునిచ్చారు. సోమవారం జిల్లాలోని శంషాబాద్ మండలం, ముచింతల్ పరిధిలోని స్వర్ణభారతి ట్రస్ట్లో నూతన సర్పంచ్లకు ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి కృష్ణారెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలనపై సర్పంచులకు పూర్తి అవగాహన అవసరం అన్నారు. గ్రామ స్థాయిలో ప్రజల ఆశయాలను నెరవేర్చే గురుతర బాధ్యత సర్పంచ్లపైనే ఉందని ఎమ్మెల్యే గుర్తుచేశారు.

ప్రభుత్వ పథకాలు, పంచాయతీ ఆర్థిక వ్యవస్థ, పాలనా విధానాలు, నిబంధనలు మరియు నిర్వహణ అంశాలపై సర్పంచ్లు పూర్తి పరిజ్ఞానం కలిగి ఉండాలని సూచించారు.సమర్థవంతమైన పాలన అందించేందుకు అవసరమైన శిక్షణ, నైపుణ్యం మరియు జ్ఞానాన్ని ప్రభుత్వం కార్యక్రమాల ద్వారా అందిస్తుందని తెలిపారు. సర్పంచులంతా  శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి గ్రామాభివృద్ధికి ఈ శిక్షణ కార్యక్రమం ఎంతో కీలకమని, ఇక్కడ నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేసి పంచాయతీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆయన కోరారు.  కార్యక్రమంలో పంచాయతీ డైరెక్టర్ పద్మజా, టీజీఐరిడీ జేడీ పద్మజా రాణి, జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి  సురేష్ మోహన్, డీఎల్పీఓలు, ఎంపీడీఓలు ఎంపీఓలు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.