20-01-2026 12:20:17 AM
లబ్ధి పొందేందుకు అధికార పార్టీ వ్యూహం
ఒకే రోజు మూడు మున్సిపాలిటీలలో కార్యక్రమాలు
బతుకమ్మ చీరల పంపిణీ సైతం..
పాల్గొన్న మూడు పార్టీల నాయకులు
మేడ్చల్, జనవరి 19 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అధికార పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఓటర్లను ఆకర్షించేందుకు ఇందిరమ్మ చీరలు పంపిణీ, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేపట్టింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పనులకు మోక్షం లభించింది. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు విరామం లేకుండా మూడు చింతలపల్లి, అలియాబాద్, ఎల్లంపేట మున్సిపాలిటీలలో వివిధ పనులకు కొబ్బరికాయ కొడుతూ రిబ్బన్లు కట్ చేస్తూ వెళ్లారు. రెండు మూడు రోజులలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. షెడ్యూల్ విడుదల అయితే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. పనులకు ప్రారంభోత్సవం చేసినందున పనులు మొదలు పెట్టేందుకు అవకాశం ఏర్పడింది. గ్రామాలలో జరుగుతున్న పన్నులను చూయించి ఓట్లు అడగవచ్చని అధికార పార్టీ నాయకులు భావిస్తున్నారు.
కొత్త మున్సిపాలిటీలకు రూ. 15 కోట్ల చొప్పున మంజూరు
కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలలో మౌలిక వసతులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ లో రూ. 15 కోట్ల చొప్పున మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టే పనులకు ప్రభుత్వ చీఫ్ విప్ పట్టం మహేందర్రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ప్రతి గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు చేపట్టనున్నారు. వీటికి సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయింది. మున్సిపాలిటీల కొత్త పాలకవర్గాలు నెల రోజుల్లో కొలువుదీరే అవకాశం ఉంది. అంతలోపు పనులు పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు సిద్ధమవుతున్నారు. అంతలోపు పూర్తి కాకుంటే కొత్త పాలకవర్గాలకు కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
పాల్గొన్న మూడు పార్టీల నాయకులు
మూడు మునిసిపాలిటీలలోని శంకుస్థాపన కార్యక్రమాలలో మూడు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. పొలిటికల్ మైలేజ్ కోసం ఆయా పార్టీల నాయకులు తమ అనుచరులతో కలిసి పాల్గొన్నారు. మూడు పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో గ్రామాలలో హడావిడి కనిపించింది. 50 పైన వాహనాలు కాన్వాయ్ లో ఉన్నాయి. ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్ని గ్రామాల్లోని కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఇందిరమ్మ చీరల పంపిణీ
మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం సైతం చేపట్టారు. అలియాబాద్, ఎల్లంపేట, మూడు చింతలపల్లి మున్సిపాలిటీలకు చెందిన మహిళలకు అలియాబాద్ లో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో పంచాయతీ ఎన్నికల ముందు మహిళలకు చీరాల పంపిణీ చేశారు. అప్పట్లో మున్సిపాలిటీలలో పంపిణీ చేయలేదు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. మేడ్చల్ లో మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అభివృద్ధి పనులు, ఇందిరమ్మ చీరల పంపిణీ అధికార పార్టీకి ఏ మేరకు లబ్ధి చేకూరుతుందో వేచి చూడాల్సిందే!