30 రోజుల కాల్పుల విరమణను రష్యా అంగీకారం
మీడియా సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటన
కొన్ని అంశాలపై అమెరికాతో చర్చించనున్నట్టు వెల్లడి
అమెరికా అధ్యక్షుడి కృషికి కృతజ్ఞతలు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌తో 30 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించారు. అయితే కాల్పుల విరమణ శాశ్వత శాంతికి దారితీయడంతో పాటు ఉద్రిక్తతల మూలకారణాలను పరిష్కరించేదిగా ఉండాలన్నారు. గురువారం క్రెమ్లిన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శత్రుత్వాలను విరమించాలనే ప్రతిపాదనతో తాము ఏకీభవిస్తున్నట్టు ప్రకటించారు. యుద్ధానికి ముగింపు పలకడం కోసం కృషి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పుతిన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా ‘అమెరికా ఆలోచన మంచిదే. దాన్ని మేము సమర్థిస్తాం. అయితే చర్చించాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి, వాటిపై అమెరికా సహచరులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది’ అని పుతిన్ పేర్కొన్నారు. అంతకుముందు కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా తిరస్కరించింది. ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సీనియర్ సహాయకుడు యూరీ ఉషాకోవ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రష్యా వ్యూహాత్మక ప్రయోజనాలను పరిగణలోకి తీసుకునే దీర్ఘకాలిక శాంతి ఒప్పందానికి మాస్కో ప్రాధాన్యత ఇస్తుందని ఉషాకోవ్ స్పష్టం చేశారు. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉక్రెయిన్ సైన్యానికి కల్పించే తాత్కాలిక ఉపశమనంగా అభివర్ణించారు.
ట్రంప్ ఏమన్నారంటే..
అమెరికా మధ్యవర్తిత్వంతో ఉక్రెయిన్ మధ్య సౌదీ అరేబియా వేదికగా శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ 30 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించింది. అయితే రష్యా మాత్రం దీనిపై కొంత స్టడీ చేసి, ఒప్పందం గురించి అమెరికా అధికారుల నుంచి సమగ్రమైన వివరణ తీసుకున్న తర్వాత తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు చెప్పింది. ఈ క్రమంలో బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. శ్వేతసౌధంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించినందున ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత రష్యాపై ఉందన్నారు. ఈ విషయంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చించడానికి అమెరికా అధికారులు రష్యాకు వెళ్లినట్టు పేర్కొన్నారు. ఒకవేళ రష్యా దీన్ని అంగీకరించకపోతే తీవ్ర ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అది రష్యా వినాశనానికి దారి తీస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ రకమైన ఫలితాన్ని తాను కోరుకోవడం లేదని, రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడమే తన లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు.






