3 May, 2026 | 12:02 AM

2025లో అత్యధిక ఉష్ణోగ్రతలు

14-03-2025 12:45 AM

గతేడాదితో పోల్చితే అధికంగా నమోదయ్యే అవకాశం

1901వ సంవత్సరం తర్వాత అత్యంత వేడి నెలగా ఫిబ్రవరి

వెంటాడుతున్న ప్రకృతి వైపరీత్య భయాలు

న్యూఢిల్లీ: ఎండల తీవ్రతకు గతేడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  ఈ ఏడాది కూడా ఉష్ణోగతలు అధికంగానే ఉండనున్నట్టు తెలుస్తుంది. 2024తో పోల్చితే ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో పాటు తరచుగా వేడి గాలులు వీస్తాయని తాజాగా భారత వాతావరణ సంస్థ(ఐఎండీ)  ప్రకటించింది. 1901వ సంవత్సరం తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో 1901 తర్వాత ఈ ఫిబ్రవరిని అత్యంత వేడి నెలగా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ క్రమంలో భారీస్థాయిలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం జరగొచ్చనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. గతేడాది ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రాంపంచీకరణకు ముందు స్థాయి కంటే ప్రపంచ వ్యాప్తంగా 1.5 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదైంది. ఈ క్రమంలో భారతదేశంలోని వయనాడ్, జైసల్మేర్ వంటి ప్రాంతాల్లో ప్రకృతి వైపరిత్యాలు సంభవించి పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం జరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా సంభవించిన ప్రకృతి వైపరిత్యాల వల్ల గత ఏడాది దేశంలో సుమారు 3,238 మంది ప్రాణాలు కోల్పోయినట్టు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ సంఖ్య 2022 కంటే 18శాతం ఎక్కువట.

సీఎస్‌ఈ నివేదికలో ఏముదంటే..

న్యూఢిల్లీ కేంద్రంగా పని చేసే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్‌ఈ) తాజాగా తన పరిశోధనకు సంబంధించిన నివేదికను ఇటీవల రాజస్థాన్‌లో జరిగిన అనిల్ అగర్వాల్ డైలాగ్ (ఏఏడీ) అనే కార్యక్రమంలో విడుదల చేసింది. ఇందులో 274 రోజులను పరిశీలించగా 255 రోజుల్లో దేశంలోని కనీసం ఏదో ఒక ప్రాంతంలో అసాధారణ వాతావరణ పరిస్థితులను గుర్తించినట్టు తన ‘స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ 2025’ రిపోర్టులో తెలిపింది. 2022, 2023 గణాంకాలతో పోల్చితే అసాధారణ వాతావరణ పరిస్థితుల నమోదు గణనీయంగా పెరిగినట్టు వెల్లడించింది. కేవలం అసాధారణ వాతావరణ పరిస్థితుల నమోదే కాకుండా వాటి తీవ్రత, వ్యవధి కూడా పెరిగాయని సీఎస్‌ఈ డైరెక్టర్ జనరల్ సునిత నరైన్ పేర్కొన్నారు. దీన్ని ప్రపంచం తప్పనిసరిగా ఎదుర్కోవాలని అన్నారు. 

భౌగోళిక పరిస్థితులూ ఒక కారణం

దేశంలోని అసాధారణ వాతావరణ పరిస్థితులకు దేశ ఉష్ణ మండల భౌగోళిక పరిస్థితులు కూడా ముఖ్య కారణాల్లో ఒకటని వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ రాక్సీ మాథ్యూ కోల్ అభిప్రాయపడ్డారు. ‘ఉష్ణమండల ప్రాంతాలు అధిక మొత్తంలో సౌర వికిరణాన్ని గ్రహిస్తాయి. గ్రీన్‌హౌస్ వాయువులు దాన్ని బంధిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో కాంక్రీటు నిర్మాణాలు పెరుగుతున్నందున ఆయా ప్రాంతాలు అధిక మొత్తంలో వేడిని గ్రహిస్తాయి. అలాగే కాంక్రీటు నిర్మాణాలు వేడిని నిలుపుకుని చల్లదనాన్ని నిరోధిస్తాయి. దీనివల్ల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం 15 డిగ్రీస్ సెల్సీయస్ వరకూ ఉంటుంది. అలాగే ఈ శతాబ్దం చివరినాటికి వేడిగాలుల తీవ్రత మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉంది’ అని మాథ్యూ కోల్ ఏఏడీ సమావేశంలో పేర్కొన్నారు.