4 April, 2026 | 5:50 PM

మరింత చౌకగా రష్యా చమురు!

03-09-2025 01:18 AM

ట్రంప్ బెదిరింపులు చేసినా బెదరని చమురు సంస్థలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా చమురు కొనుగోలు చేయొద్దని భారత్‌పై సుంకాలతో విరుచుకుపడ్డా చమురు సంస్థలు మాత్రం వెనుకడుగు వేయట్లేదు. రష్యా చమురు భారతీయ కంపెనీలకు మరింత చౌకగా లభించే అవకాశం ఉన్నట్టు బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. బ్రెంట్ చమురు ధరతో పోలిస్తే 3 డాలర్లు తక్కువ ధరకు లభించనున్నట్టు సమాచారం.

రష్యా నుంచి సముద్రమార్గాన చమురు అధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలో భారత్ తొలిస్థానంలో ఉంది. భారత్‌కు రష్యానే అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉంది. జూలై నెలలో రూ. 31,775 కోట్ల విలువగల చమురును మన దేశం రష్యా నుంచి కొనుగోలు చేసింది. మన మొత్తం దిగుమతుల్లో రష్యా వాటానే 31.4 శాతంగా ఉంది. ఇటీవలే చైనా వేదికగా జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. బ్యారెల్ చమురు ధర జూలై కంటే 1 డాలర్ తక్కువకు రానుందని తెలుస్తోంది.