అఫ్ఘాన్‌లో మళ్లీ ప్రకంపనలు
-48 గంటలు గడవకుండానే మరోసారి కంపించిన భూమి
-1400 దాటిన మృతుల సంఖ్య
కాబూల్, సెప్టెంబర్ 2: అఫ్ఘానిస్తాన్ ప్రజలు ఘోర భూకంపం గురించి మరువక ముందే మంగళవారం కూడా అక్కడ మరో భూకంపం సంభవించింది. 5.3 తీవ్రతతో హిందూషిక్ రీజియన్‌లో మంగళవారం సాయంత్రం ప్రకంపన లు చోటు చేసుకున్నాయి.
48 గంటలు కూడా గడవకముందే అఫ్ఘానిస్తాన్‌లో మరో భూకంపం సంభవించడంతో ప్రజల ఇబ్బందులు, కష్టాలు రెట్టింపయ్యాయి. ఆదివారం రాత్రి 6.3 తీవ్రతతో అక్కడ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం ధాటికి వేలల్లో మృతి చెందగా.. అనేక మంది గాయపడ్డారు. నంగర్హార్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్ నగరానికి ఈశాన్యంలో భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
పెరిగిన మృతుల సంఖ్య..
ఆదివారం సంభవించిన భూకంపం ధాటికి మరణించిన వారి సంఖ్య 1400 దాటింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారి సంఖ్య 3,124కు చేరుకుందని తాలిబన్ అధికారిక ప్రభుత్వం తెలియజేసింది.




