రై రై రైజర్స్
స్లో పిచ్‌పై.. స్పిన్ అస్త్రంతో విజృంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మొదట బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడి పోరాడే స్కోరు అందించగా.. బౌలర్లు సమష్టిగా సత్తాచాటి రాయల్స్‌కు చెక్ పెట్టారు. క్లాసెన్ అర్ధశతకంతో రాణిస్తే.. బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేకపోయిన ఓపెనర్ అభిషేక్ శర్మ బంతితో దుమ్మురేపాడు! సీజన్ ఆసాంతం రాణించిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్, రియాన్ పరాగ్ కీలక పోరులో చేతులెత్తేయగా.. హైదరాబాద్ ముచ్చటగా మూడోసారి
తుదిపోరుకు అర్హత సాధించింది. క్వాలిఫయ ర్ కోల్‌కతా చేతిలో ఓడిన హైదరాబాద్.. ఆదివారం జరగనున్న టైటిల్ ఫైట్‌లో మరోసారి అదే జట్టుతో తలపడనుంది.
చెన్నై: ఎక్కడ పోగొట్టుకున్నామో.. అక్కడే వెతుక్కోవాలి అనే చందంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ చెలరేగిపోయింది. క్వాలిఫయర్1లో పరాజయం పాలైన రైజర్స్.. క్వాలిఫయర్ విజృంభించి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్ వంటి పోరులో సన్‌రైజర్స్ హైదరబాద్ 36 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో క్వాలిఫయర్1లో తలపడ్డ కోల్‌కతా, హైదరాబాద్ మధ్యే ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (34 బంతుల్లో 50; 4 సిక్సర్లు) అర్ధశతకం సాధించగా.
రాహుల్ త్రిపాఠి (15 బంతుల్లో 37; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ట్రావిస్ హెడ్ (28 బంతుల్లో 34; 3 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. చాన్నాళ్ల తర్వాత తుది జట్టులో చోటు దక్కించుకున్న మార్క్మ్ (1), తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (5), అబ్దుల్ సమద్ (0) విఫలమయ్యారు. తొలి ఓవర్‌లోనే సిక్సర్, ఫోర్‌తో జోరు కనబర్చిన యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (12) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. షాబాజ్ అహ్మద్ (18) చివర్లో విలువైన పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్‌చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
అనంతరం లక్ష్యఛేదనలో రాజస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులకు పరిమితమైంది. యశస్వి జైస్వాల్ (21 బంతుల్లో 42; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించగా.. ధ్రువ్ జురెల్ (35 బంతుల్లో 56 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో పోరాడాడు. కెప్టెన్ సంజూ శాంసన్ (10), రియాన్ పరాగ్ (6), కాడ్మోర్ (10) విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో షాబాజ్ అహ్మద్ 3, అభిషేక్ శర్మ రెండు వికెట్లు పడగొట్టారు. షాబాజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
క్లాసెన్ క్లాస్ ఇన్నింగ్స్
అభిమానులంతా ఆశించినట్లే.. హైదరాబాద్‌కు తొలుత బ్యాటింగ్ చేసే అవకాశం రాగా.. మొదటి ఓవర్‌లోనే అభిషేక్ 6,4తో పరుగుల ప్రవాహానికి తెరలేపాడు. ఇంకేముంది ఓపెనర్ల ఊచకోత ప్రారంభమైనట్లే అని అనుకునేంత లోపే.. అభిషేక్‌ను బౌల్ట్ బుట్టలో వేసుకున్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో సున్నాలు చుట్టిన హెడ్.. కాస్త నిధానంగా ఆడగా.. రాహుల్ త్రిపాఠి వచ్చీరావడంతోనే బౌండ్రీల మోత మోగించాడు. అశ్విన్ ఓవర్‌లో 4,4,6 కొట్టిన త్రిపాఠి.. బౌల్ట్ బౌలింగ్‌లో 6,4 అరుసుకున్నాడు. అదే జోరులో మరో షాట్ ఆడే ప్రయత్నం చేసి చాహల్ చేతికి చిక్కాడు. ఇక చాన్నాళ్లుగా బెంచ్‌కే పరిమితమైన మార్క్మ్.్ర. రెండో బంతికే ఔటయ్యాడు. ఫలితంగా ఐదు ఓవర్లు ముగిసే సరికి 57/3తో నిలిచింది.
ఆ తర్వాత హెడ్ కాస్త వేగం అందుకున్నాడు. దీంతో ఇన్నింగ్స్ గాడిన పడ్డట్లే అనుకుంటుండగా.. హెడ్ ఔటయ్యాడు. క్లాసెన్ తన శైలికి భిన్నంగా ఆడగా.. అవేశ్ ఖాన్ వరుస బంతుల్లో నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్‌ను పెవిలియన్‌కు పంపాడు. రాయల్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల రాక గగనం కాగా.. ఆచితూచి ఆడిన క్లాసెన్ 33 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్పిన్నర్లు ప్రభావం చూపుతారనుకున్న చోట అశ్విన్, చాహల్ ఒక్క వికెట్ పడగొట్టలేకపోగా.. ముగ్గురు పేసర్లు కలిసి ఎనిమిది వికెట్లు పంచుకున్నారు.
బౌలర్లు భళా!
స్కోరు బోర్డుపై సరిపడ స్కోరు పెట్టలేదనుకున్న హైదరాబాద్.. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కట్టిపడేసింది. బౌలర్లు చురకత్తుల్లాంటి బంతులు విసిరితే.. ఫీల్డింగ్‌లో ప్రతి ఒక్కరూ జాంటీ రోడ్స్‌ను తలపించారు. క్రీజులో ఉన్నంతసేపు ఇబ్బందిగా కనిపించిన కాడ్మోర్‌ను కమిన్స్ ఔట్ చేయగా.. భువనేశ్వర్ ఓవర్‌లో జైస్వాల్ రెచ్చిపోయాడు. 6,4,4,4 బాదాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి రాయల్స్ 51/1తో నిలిచింది. ఛేదన సాఫీగా సాగుతున్న దశలో రైజర్స్ స్పిన్నర్లు విజృంభించారు. జోరు మీదున్న జైస్వాల్‌ను షాబాజ్ వెనక్కి పంపగా.. శాంసన్‌ను అభిషేక్ ఔట్ చేశాడు.
దీంతో ఒక్కసారిగా మ్యాచ్ గమనం మారిపోగా.. ఇక అక్కడి నుంచి మైదానంలో రైజర్స్ ఫీల్డర్లు కొదమసింహాలను తలపించారు. పకడ్బందీ బౌలింగ్ అంతకు మించిన ఫీల్డింగ్‌తో రాయల్స్‌కు పరుగుల రాక గగనమైంది. ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో షాబాజ్.. రెండు వికెట్లు తీసి రాయల్స్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టాడు. అభిషేక్ పట్టిన చురుకైన క్యాచ్‌కు రియాన్ పరాగ్ వెనుదిరగగా.. అశ్విన్ డకౌటయ్యాడు. ధాటిగా ఆడతారనుకున్న హెట్‌మైర్ (10 బంతుల్లో 4), రావ్‌మన్ పావెల్ (12 బంతుల్లో 6) పూర్తిగా నిరాశ పరచగా.. ధ్రువ్ జురెల్ చివరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. అయితే అతడికి మరో ఎండ్ నుంచి సరైన సహకారం లభించకపోవడంతో రాయల్స్‌కు పరాజయం తప్పలేదు.






