ఎప్పటికీ రుణపడి ఉంటా.. థాంక్యూ డీకే
న్యూఢిల్లీ: ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ (డీకే)పై టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు. క్లిష్ట సమయంలో తనకు డీకే అండగా నిలబడి విలువైన సూచనలు ఇచ్చాడని పేర్కొన్నాడు. దినేశ్ కార్తీక్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కోహ్లీ ‘ 2022 ఐపీఎల్ సీజన్ నాకు అనుకున్నంత గొప్పగా సాగలేదు. ఫామ్ కోల్పోయి ఆత్మవిశ్వాసం విషయంలో చాలా ఇబ్బంది ఎదుర్కొన్నా. ఈ విషయాన్ని కార్తిక్ దగ్గర ప్రస్తావించా. దీంతో కార్తీక్ ఒత్తిడిని ఎలా అధిగమించాలన్నది వివరంగా చెప్పాడు. ఆ సమయంలో నాకు ఎన్నో విలువైన సూచనలు, సలహాలు అందించాడు. థాంక్యూ డీకే.. ఈ విషయంలో నీకు ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇక డీకేను తొలిసారి కలిసిన సందర్భం నాకింకా గుర్తుంది. 2009 చాంపియన్స్ ట్రోఫీ అనుకుంటా. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో మేమిద్దరం ఆడాం. అతడితో కలిసి మొదటిసారి డ్రెస్సింగ్‌రూమ్‌ను పంచుకున్నా.
చాలా సరదాగా ఉంటాడు. హైపర్ యాక్టివ్ కావడంతో డ్రెస్సింగ్ రూమ్‌లో ఊరికే అటు ఇటూ తిరుగుతూ కనిపించేవాడు. చాలా కన్ఫ్యూజ్‌గా ఉండేవాడు. కార్తీక్‌పై నాకు కలిగిన తొలి ఇంప్రెషన్ అదే. అయితే అతడు అద్భుతమైన ప్రతిభావంతుడు. మైదానం వెలుపల అతడి సంభాషణ చాలా ఆసక్తికరం. అన్ని విషయాల్లో మంచి నైపుణ్యం అతడి సొంతం. నా దృష్టిలో కార్తిక్‌ను ఇదే ప్రత్యేకంగా నిలిపింది’ అని పేర్కొన్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో 257 మ్యాచ్‌లాడిన కార్తీక్ 4842 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు చాన్నాళ్ల క్రితమే దూరమైన అతడు భారత జట్టుకు 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు.






