23 August, 2026 | 5:48 PM

రైతుభరోసా అమలు జేయాలి

13-06-2024 05:00 AM
  • వరికి 500 బోనస్ బోగస్ హామీ

మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఫైర్

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఈ వానకాలం నుంచి రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.7,500 అమలు చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు రైతు భరోసా ఉన్నట్టా, లేనట్టా సమాధానం చెప్పాలని బుధవారం ఓ ప్రకటనలో కోరారు. కాంగ్రెస్‌కు ఎన్నికల ప్రచారం మీద ఉన్న సోయి.. విధివిధానాలు రూపకల్పన మీద లేదని మండిపడ్డారు. ఏడు నెలల నుంచి ముఖ్యమంత్రి, మంత్రులకు తీరకలేదా? ఏ పథకం గురించి అడిగినా ముఖ్యమంత్రి, మంత్రులు ‘ఓ స్త్రీ రేపు రా’ అన్న తరహాలో వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. డిసెంబర్ 9న రూ.15 వేలు రైతు భరోసా అన్న ముఖ్యమంత్రి హామీలు నీటి మీద రాతలేనని తేలిపోయిందని చెప్పారు.

ఇప్పడు రైతు భరోసా విధివిధానాలు, ఎన్ని ఎకరాలకు పరిమితం చేయాలని మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల హామీల్లో ఎందుకు రైతు భరోసాను పరిమితం చేస్తామని చెప్పలేదని నిలదీశారు. రైతు భరోసాకు దిక్కులేదు, కౌలు రైతుల ఊసేలేదు, రైతుకూలీల గురించి పట్టించుకున్న నాథుడు లేడని ఆగ్రహం వ్యక్తంచేశారు. వరికి రూ. 500 బోనస్ వట్టి బోగస్ అని తేలిపోయిందని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే రైతు భరోసాను ఐదెకరాలకో, పదెకరాలకో పరిమితం చేస్తామని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

కాలయాపన కోసమే శాసనసభ సమావేశాలు అంటూ ఊదరగొడుతున్నారని మండిపడ్డారు. రైతు బీమా కొనసాగిస్తారా, ఎత్తేసారా తేల్చి చెప్పాలన్నారు. అబద్ధపు హామీలతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ రాష్ట్ర రైతాంగాన్ని నిలువునా ముంచుతుందన్నారు.