మెంచు చక్రయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే మందుల సామేలు
నూతనకల్,(విజయక్రాంతి): మండల పరిధిలోని మిర్యాల గ్రామంలో మాజీ సర్పంచ్, దివంగత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మెంచు చక్రయ్య గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామేలు ముఖ్య అతిథిగా విచ్చేసి, చక్రయ్య గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు, కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.ప్రజాసేవకుడు మెంచు చక్రయ్య గౌడ్
విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ.. మిర్యాల గ్రామ అభివృద్ధికి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చక్రయ్య గౌడ్ చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు. సర్పంచ్‌గా ఆయన ప్రజలకు అందించిన సేవలు ఎప్పటికీ నిలిచిపోతాయని గుర్తుచేశారు. నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసమే తపించిన చక్రయ్య గౌడ్ లేని లోటు కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రాంతానికి తీరని లోటు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
"చక్రయ్య గౌడ్ ఆశయ సాధనకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.చక్రయ్య గౌడ్ కుటుంబానికి, మిర్యాల గ్రామానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.మిర్యాల గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిదర్ రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ నాగం జయసుధ సుధాకర్ రెడ్డి, సర్పంచ్ అనంతుల శ్రీనివాస్,మెంచు చక్రయ్య కుటుంబ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల ముఖ్య నాయకులు, మిర్యాల గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దివంగత నేతకు ఘన నివాళులర్పించారు.






