సఖి కేంద్రాలు.. మహిళా రక్షణ నిలయాలు..
సూర్యాపేట (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని దానిలో భాగంగా ఏర్పాటు చేసిన సఖి కేంద్రాలు మహిళా రక్షణ నిలయాలని సూర్యాపేట సఖి కేంద్రం కేస్ వర్కర్ పి. భవాని అన్నారు. సూర్యాపేట మండల(Suryapet Mandal) పరిధిలోని శనివారం ఎండ్లపల్లి, రామారం, రత్నపురం గ్రామాల ఉపాధి హామీ కూలీలకు సఖి కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ... గృహహింస, వరకట్నం, ప్రజలు పనిచేసే చోట లైంగిక వేధింపులు, ఆడపిల్లల అమ్మకం, ఆడపిల్లల అక్రమ రవాణా, ఇతరుల నుంచి సమస్యలు ఎదుర్కొనే అతివలు, బాలికలకు భరోసా కల్పించేందుకు సఖి కేంద్రం పనిచేస్తుందన్నారు. అవసరమైన వారికి పోలీసుల సేవలు, న్యాయపరమైన సేవలు ఉచితంగా అందిస్తుందన్నారు. మహిళలకు ఏ కష్టం వచ్చినా హెల్ప్ లైన్ నెంబర్ 181 కు కాల్ చేసి సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ నిర్వాహకులు, కూలీలు పాల్గొన్నారు.






