సలామ్ రహీమ్ సాబ్

17-04-2024 01:16:44 PM

హైదరాబాద్ కి షాన్.. దేశ్‌కి ఫుట్‌బాల్ నిషాన్

అత్యుత్తమ ఫుట్‌బాల్ కోచ్‌గా మన్ననలు 

ఒలింపిక్స్‌లో భారత జట్టుకు నాలుగో స్థానం

విల్లు ఎక్కు పెడితే పక్షి కన్ను తప్ప మరోటి కనిపించని పార్థుడిలా.. 

మైదానంలో అడుగు పెడితే అతడికి గోల్ పోస్ట్ తప్ప మరేం కనిపించదు!

ఉదయం ఐదు గంటలకు గ్రౌండ్‌కు రావాలని చెబితే.. 

నాలుగున్నరకే మైదానంలో ప్రత్యక్షమయ్యే వ్యక్తిత్వం అతడిది!

అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శన కనబర్చాలంటే.. 

సహజ ప్రతిభకు శిక్షణ అవసరమని బలంగా నమ్మిన వ్యక్తి అతడు!

ఈ ఉపోద్ఘాతమంతా.. దిగ్గజ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ సాబ్ గురించే. మెరవాలంటే వజ్రాన్ని అయినా సానబెట్టాల్సిందే అనే నానుడిని నూటికి నూరు పాళ్లు నమ్మిన మన హైదరాబాదీ రహీమ్ సాబ్.. ఆసియాలో భారత్‌ను ఓడించడం అసాధ్యం అనే స్థాయికి మన జట్టును తీసుకెళ్లాడు. ఆయన శిక్షణ ఇచ్చిన పుష్కర కాలం భారత ఫుట్‌బాల్‌కు స్వర్ణయుగం అనడంలో రవ్వంత అతిశయోక్తి లేదు. యావత్ దేశం హాకీ మత్తులో జోగుతున్న సమయంలో యువతను ఫుట్‌బాల్ వైపు మళ్లించిన రహీమ్ సాబ్‌పై ప్రత్యేక కథనం.. 

ఇప్పుడంటే భారత ఫుట్‌బాల్ జట్టు ఫిఫా ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీల్లోనూ సత్తాచాటలేకపోతోంది కానీ.. ఒకప్పుడు మన ఖండంలో టీమిండియాకు అసలు ఎదురే ఉండేది కాదు. బరిలోకి దిగితే బంగారు పతకం ఖాయమే అన్న రీతిలో మనవాళ్ల ప్రదర్శన ఉండేది. 1950, 60ల్లో మన ఫుట్‌బాల్ టీమ్ అత్యుత్తమ విజయాలు నమోదు చేసుకుంది. మైదానంలో దిగి ఆడింది ప్లేయర్లే అయినా.. వారిని వెనకుండి నడిపించింది మాత్రం హైదరాబాద్‌కు చెందిన రహీమ్ సాబే. 1909 ఆగస్టు 17న హైదరాబాద్‌లో జన్మించిన రహీమ్ కొన్నాళ్లు టీచర్‌గా పనిచేశారు. ఫుట్‌బాల్‌పై ఉన్న అమితమైన మక్కువతో ఉపాధ్యాయ ఉద్యోగాన్ని వదులుకొని హైదరాబాద్  సిటీ పోలీస్ జట్టుకు కోచ్‌గా పనిచేశారు. రహీమ్ శిక్షణలో హైదరాబాద్ సిటీ పోలీస్ జట్టు జాతీయ స్థాయిలో ఎన్నో గొప్ప విజయాలు సాధించింది. సిటీ పోలీస్ జట్టును అత్యుత్తమ జట్టుగా నిలిపిన రహీమ్ ఆ తర్వాత 1950 నుంచి ఏకంగా 13 ఏళ్ల పాటు భారత టీమ్ మేనేజర్‌గా పనిచేసి జాతీయ జట్టుకు ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. 

ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణాలు

రహీమ్ సాబ్ శిక్షణలోనే భారత ఫుట్‌బాల్ జట్టు 1951 ఢిల్లీ, 1962 జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించింది. 1952 హెల్సింకి, 1956 మెల్‌బోర్న్, 1960 రోమ్ ఒలింపిక్స్ క్రీడల్లోనూ భారత జట్టుకు రహీమ్ కోచ్‌గా వ్యవహరించారు. మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో భారత్ నాలుగో స్థానంలో నిలవడం విశేషం. ముఖ్యంగా 1962 జకార్తా ఆసియా క్రీడల్లో కొరియా జట్టుపై భారత జట్టు సాధించిన విజయాన్ని ఏ ఫుట్‌బాల్ అభిమానీ మరచిపోలేడు. ప్లేయర్లను రాటు దేల్చేందుకు పోలీసు శిక్షణ తరహాలో ట్రైనింగ్ ఇచ్చే రహీమ్ సాబ్.. సాధన అనంతరం తన స్ఫూర్తివంతమైన మోటివేషన్ స్పీచ్‌లతో ఆటగాళ్లలో స్ఫూర్తి నింపేవారు. 

టెక్నిక్‌కు ఆద్యుడు

కోచ్‌గా రహీమ్ గొప్పతనం ఆయన దూరదృష్టిలోనే కనిపిస్తుంది. ఎంతో ముందుచూ పుతో ఆలోచించి ఇచ్చే శిక్షణ, వ్యూహాలు జట్టుకు మంచి ఫలితాలు ఇచ్చాయి. అప్పటి వరకు భారత జట్టు ఆడుతూ వచ్చిన బ్రిటిష్ శైలి తరహా ఆట మనకు కుదరదంటూ చిన్న చిన్న పాస్లతో కొత్త టెక్నిక్‌ను ఆయన మన ఆటలో జోడించారు. మైదానంలో 4 4 వ్యూహాన్ని రహీమ్ చాలా ముందుగా అనుసరించారు. అదే శైలితో బ్రెజిల్ 1958, 1962 ప్రపంచకప్లలో ఆడి టైటిల్ గెలవడం విశేషం. ఫార్వర్డ్ లేకుండా ఆరుగురు మిడ్‌ఫీల్డర్లతో ఆడించడం కూడా అప్పట్లో ఒక కొత్త వ్యూహమే. మోటివేషన్ స్పీకర్ తరహాలో ఆయన ఇచ్చే స్ఫూర్తిదాయక ప్రసంగాలు తమలో విజయకాంక్షను నింపేవని ఆటగాళ్లు చెబుతారు.  

పొందిందేమీ లేదు!

1962లో జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన తర్వాతి ఏడాదే జూన్ 11న, 1963లో హైదరాబాద్‌లో రహీమ్ ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా కన్నుమూశారు. ఆయన సహచర ఆటగాడు ఫ్రాంకో ఫార్చునాటో... ‘రహీమ్ సాబ్ తనతో పాటు భారత ఫుట్‌బాల్‌ను కూడా సమాధిలోకి తీసుకుపోయారు’ అని వ్యాఖ్యానించడం ఆయన చేసిన సేవలకు నిదర్శనం. నిజంగా అదే జరిగింది. ఆ తర్వాత అంతకంతకూ దిగజారుతూ వచ్చిన భారత ఫుట్‌బాల్ ప్రమాణాలు ఇక కోలుకోలేని విధంగా మరింత పతనావస్థకు చేరిపోయాయి. కోచ్‌గా అజరామర కీర్తిప్రతిష్టలు దక్కినా రహీమ్ సాబ్‌కు ప్రభుత్వం మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. తన జీవితకాలంతో ఆయన ఆర్థికంగా పెద్దగా పొందింది ఏమీ లేదు. చనిపోయిన తర్వాత కూడా ఎలాంటి పురస్కారాలు దక్కలేదు. రహీమ్ సాబ్ శిక్షణ అనంతరం 1960 రోమ్ ఒలింపిక్స్ తర్వాత నుంచి భారత ఫుట్‌బాల్ జట్టు మళ్లీ ఒలింపిక్స్‌కుఅర్హత సాధించకపోవడం గమనార్హం.

అది కోచింగ్ అంటే

1964లో భారత ఫుట్‌బాల్ కోచ్‌గా పనిచేసిన ఆల్బర్టో ఫెర్నాండో ఆ సమయంలో శిక్షణకు సంబంధించి బ్రెజిల్లో నిర్వహించిన ప్రత్యేక వర్క్ షాప్‌నకు హాజరయ్యాడు. తిరిగొచ్చిన తర్వాత అతడన్న ఒకే ఒక్క మాటా.. ‘అక్కడ కొత్తగా నేర్చుకోవడానికి ఏముంది. 1956లో రహీమ్ సర్ మాకు నేర్పించిందే ఇప్పుడు అక్కడ చెబుతున్నారు. రహీమ్ సాబ్ నిజంగా ఫుట్‌బాల్ ప్రవక్త’ అన్నాడు. ఈ మాటలు చాలు కోచ్‌గా రహీమ్ చూపించిన ప్రభావం ఏంటో చెప్పడానికి. నాటి తరంలోనే కొత్త తరహా టిక్నిక్‌తో భారత ఫుట్‌బాల్‌ను పరుగులెత్తించిన మన హైదరాబాదీ రహీమ్ సాబ్ సాకర్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.