04-02-2026 03:13:40 PM
హనుమకొండ జిల్లా హైర్ బస్సు డ్రైవర్ల, క్లీనర్స్ సంఘం అధ్యక్షులు బుర్ర హరికృష్ణ
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): టిజిఎస్ఆర్టిసి హైర్ బస్సు డ్రైవర్ల సంఘం అధ్యక్షులు బుర్ర హరికృష్ణ ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో డ్రైవర్లు, క్లీనర్ల సమస్యలపై సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ టిజీఆర్టీసీ సంస్థలో అద్దె బస్సులు ప్రవేశపెట్టిన నాటి నుండి మేమంతా డ్రైవర్లుగా, క్లీనర్లుగా పనిచేస్తున్నామని, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వేతన ఒప్పందం అద్దె బస్సు యజమాలతో చేసుకోవడం జరుగుతుందని అన్నారు.
కానీ యజమానులు ఈసారి వేతన ఒప్పందాలకు విరుద్ధంగా వేతన సవరణ చేయడం లేదని వాపోయారు. కాబట్టి ప్రస్తుత కాలంలో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నింటినందున, అద్దె బస్సులపై ఆధారపడి జీవిస్తున్న మేమంతా ఆర్థిక భారం మోయలేక విద్య, వైద్యం, కుటుంబ అవసరాలు తీర్చలేక మనుగడ మరింత ప్రశ్నార్థకంగా మారిందాన్ని అన్నారు. మా యొక్క డిమాండ్లు ఎక్స్ప్రెస్ డ్రైవర్ కు 25,500, పల్లె వెలుగు బస్సు డ్రైవర్ కు 24,500 రూపాయల చొప్పున వేతనం చెల్లించాలి. క్లీనర్లకు 6000 రూపాయల వేతనం చొప్పున చెల్లించాలి. ప్రతి నెల 5వ తారీఖున వేతనం అందించాలి. దసరా పండుగ సందర్భంగా ఒక నెల వేతనం, రెండు జతల బట్టలు ఇవ్వాలి.
డ్రైవర్ రిపోర్ట్ చేసిన తర్వాత కండక్టర్ లేని ఎడల డ్రైవర్ రిపోర్టు జీతభత్యం చెల్లించాలి. గ్యారేజ్ పనుల నిమిత్తం వెళ్లినప్పుడు వేతనంతో కూడిన బత్త చెల్లించాలి. నైట్ ఆల్ డ్యూటీకి అదనంగా 250 రూపాయలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ 1, వరంగల్ 2, హనుమకొండ డిపోల అధ్యక్షులు కొలిపాక ఉపేందర్, బొమ్మకంటి సంజీవ, వైనాల శ్రీనివాస్, సెక్రెటరీలు రాగుల గణపతి, తిరుపతి శ్రీనివాస్, గడ్డం శ్రీను, ఉపాధ్యక్షులు జూలూరీ జగన్, షేక్ మైన్ పాషా, ఆరూరి రామారావు, జాయింట్ సెక్రెటరీలు చొప్పరి అనిల్, అప్పం కళాధర్, బస్సు డ్రైవర్లు, క్లీనర్లు తదితరులు పాల్గొన్నారు.